జీ20 డిన్నర్.. ఖర్గేకే కాదు నడ్డాకు అందని ఆహ్వానం.. రచ్చ చేసి ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్!!
జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇస్తున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంది.
జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇస్తున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం లేకపోవడంతో కేంద్రంలోని మోదీ ప్రబుత్వంపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీ20 విందు విందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. ఆ తర్వాత దీనిపై పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు.
ప్రజాస్వామ్యం లేని లేదా ప్రతిపక్షం లేని దేశాలలో మాత్రమే ఇది జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే జీ20 డిన్నర్‌కు ఆహ్వానం అందకపోవడంపై మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటికే దీనిపై స్పందించాను. మా పార్టీ దీనిపై స్పందించింది. ఇది మంచి రాజకీయం కాదు, వారు (కేంద్రం) అలా చేయకూడదు. తక్కువ స్థాయి రాజకీయాలు’’ అని అన్నారు.
అయితే ఈ విషయంపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జీ20 డిన్నర్‌కు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఆహ్వానం లేదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. జీ20 విందుకు ఖర్గేనే కాదు.. జేపీ నడ్డాను కూడా ఆహ్వానించలేదని చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్టు అయింది.