‘‘హిందువులను గుడి ముందు ఉరేస్తాం ’’.. కేరళలో ముస్లిం లీగ్ కార్యకర్తల నినాదాలు, భగ్గుమన్న బీజేపీ
కేరళలో ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు ‘‘హిందూ వ్యతిరేక’’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. హిందువులను దేవాలయాల ముందు ఉరితీస్తామని, సజీవ దహనం చేస్తామని బెదిరించేలా వారు నినాదాలు చేశారు.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు, వైరల్ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేరళలో ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు ‘‘హిందూ వ్యతిరేక’’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోన్ బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. దీని ప్రకారం కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు చెందిన కార్యకర్తలు హిందువులను దేవాలయాల ముందు ఉరితీస్తామని, సజీవ దహనం చేస్తామని బెదిరించేలా నినాదాలు చేశారు. ఐయూఎంఎల్ యువజన విభాగం కేరళలోని కాసరగోడ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది.
దీనిపై అమిత్ మాలవీయ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పినరయి ప్రభుత్వం వారికి మద్ధతుగా నిలవకపోతే వారు ఇంత దూరం వెళ్లే సాహసం చేసేవారు కాదన్నారు. ఇప్పుడు కేరళలో హిందువులు, క్రైస్తవులు సురక్షితంగా వున్నారా అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం జరిగిన మరో ర్యాలీలో ఓ ఏడేళ్ల బాలుడు తన తండ్రి భుజంపై కూర్చొని .. హిందువులు, క్రైస్తవులు వారి అంత్యక్రియల కోసం బియ్యం, పువ్వులు, కర్పూరం సిద్ధంగా వుంచుకోవాలంటూ నినాదాలు చేశారని అమిత్ పేర్కొన్నారు. కేరళలో ప్రస్తుతం రాడికలైజేషన్ తీవ్రమైందన్నారు.
మరోవైపు.. రెచ్చగొట్టేలా ఆరోపణలు చేశారనే అభియోగాలపై కేరళలో 300 మందికిపైగా ఇడియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) యువజన విభాగం సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మణిపూర్ హింసాకాండ బాధితులకు సంఘీభావంగా మంగళవారం కన్హంగాడ్‌లో యూత్ లీగ్ నిర్వహించిన మార్చ్‌లో రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న 300 మందిపై బీజేపీ కన్హంగాడ్ మండల అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినందుకు గాను ఐపీసీ సెక్షన్ 153 ఏ కింద వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
కాగా.. రెచ్చగొట్టే నినాదాలు చేసిన కార్యకర్తను సంస్థ నుంచి బహిష్కరించినట్లు యూత్ లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోజ్ తెలిపారు. కన్హంగాడ్ మునిసిపాలిటీకి చెందిన అబ్ధుల్ సలామ్ యూత్ లీగ్ భావజాలానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. మార్చ్ సందర్భంగా కార్యకర్తలు చేయాల్సిన నినాదాలను ముందే ఇచ్చినప్పటికీ వారు తమ సొంత నినాదాలు చేశారని ఫిరోజ్ పేర్కొన్నారు. కేరళ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షానికి కీలక మిత్రపక్షంగా వున్న యూత్ లీగ్, ముస్లిం లీగ్‌లకు సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మద్ధతుగా నిలిచిందని బీజేపీ ఆరోపించింది.