కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబందించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ద్రౌపది ముర్ముకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని అన్నారు. అధిర్ రంజాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఆదివాసీ విరోధి కాంగ్రెస్.. మహిళా విరోధి కాంగ్రెస్.. గరీబ్ విరోధి కాంగ్రెస్.. ’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘సోనియా గాంధీ.. మీరు ద్రౌపది ముర్ము అవమానాన్ని ఆమోదించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను అవమానించడాన్ని సోనియా ఆమోదించారు’’ లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ.. ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆమెను.. ‘‘తోలుబొమ్మ’’, ‘‘చెడుకు చిహ్నం’’ అని కామెంట్ చేస్తున్నారని అన్నారు.

ఇదే విషయంలో లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించినందుకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సోనియా గాంధీ దేశం ముందుకు వచ్చి రాష్ట్రపతిని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. 

మరోవైపు ఇదే విషయంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన సెక్సిస్ట్ అవమానం. సోనియా గాంధీ భారత రాష్ట్రపతికి, దేశానికి క్షమాపణ చెప్పాలి’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. 

క్షమాపణ చెప్పారు.. సోనియా
మరోవైపు పార్లమెంట్ ఆవరణలో అధిర్ రంజన్ చౌదరితో క్షమాపణ చెప్పిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై సోనియా స్పందించారు. ‘‘అతను ఇప్పటికే క్షమాపణలు చెప్పారు’’ అని పేర్కొన్నారు. 

పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అన్నాను.. అధిర్ రంజన్ చౌదరి
అయితే తాను పొరపాటుగా రాష్ట్రపత్ని అని అన్నానని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని చెప్పారు. ‘‘క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు. నేను పొరపాటున 'రాష్ట్రపత్ని' అని చెప్పాను. ఇప్పుడు మీరు దాని కోసం నన్ను ఉరితీయాలనుకుంటే.. మీరు ఆ పని చేయవచ్చు. అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా దీనిని పెద్దగా చేయాలని చూస్తుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి చౌదరి చెప్పారు. 

అసలేం ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఒక వీడియో క్లిప్‌లో.. అధిర్ రంజన్ చౌదరి.. ముర్ముని 'రాష్ట్రపత్ని' అని మాట్లాడటం వినిపిస్తోంది. ‘‘భారతదేశపు ‘రాష్ట్రపత్ని’ అందరికీ సంబంధించినది’’ అని అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు మళ్లీ గురువారం రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.