న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కారణాలను విశ్లేషించేందుకు  ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ నాయకత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ చవాన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, విన్సెంట్, హెచ్. పాలా,జోతిమణి ఉన్నారు.  

ఈ కమిటీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నాయి.  ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కమిటీ పర్యటించనుంది.  ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆయా రాష్ట్రాల నేతలతో చర్చించనుంది. స్థానిక నేతలను సంప్రదించి  నివేదికను తయారు చేయనుంది.  అస్సాం, కేరళలలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉండేది. కానీ, ఇది సాధ్యం కాలేదు.

also read:ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల ఫలితాలు:నివేదిక కోరిన సోనియా

ఇక్కడ కూడా పార్టీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పుదుచ్చేరిలో చివరిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, పార్టీ ఇక్కడ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చరిత్రలో మొదటిసారిగా ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ తన భాగస్వామి డిఎంకేతో కలసి పదేళ్ల తర్వాత తమిళనాడులో తిరిగి అధికారంలోకి రావడం ఒక్కటే కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఉపశమనం కలిగించే విషయం.

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపర్చాయి. రెండు రోజుల క్రితం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సోనియాగాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.