న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ పార్టీ నేతలను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ)  వర్చువల్ గా సోమవారం నాడు జరిగింది. అసోం, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ విషయమై ఈ సమావేశంలో సోనియాగాంధీ పార్టీ నేతలతో చర్చించారు. ఆయా రాష్ట్రాల ఇంచార్జీలతో పాటు పార్టీ సీనియర్లతో ఆమె  ఈ విషయమై చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కకపోవడంపై సోనియాగాంధీ పార్టీ నేతలతో చర్చించారు. 

ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై తనకు స్పష్టమైన  నివేదికను ఇవ్వాలని  పార్టీ నేతలను ఆదేశించారు సోనియాగాంధీ.సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మేం మా ఇంటిని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయని  ఆమె అభిప్రాయపడ్డారు.

పార్టీ తీవ్రమైన  ఎదురుదెబ్బను మనం గమనించాలన్నారు. ఈ ఫలితాలతో తాము తీవ్ర నిరాశకు గురైనట్టుగా సోనియాగాంధీ చెప్పారు. పార్టీ ఈ రకమైన ఫలితాలను సాధించడానికి కారణమైన ప్రతి అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోరుతానని ఆమె చెప్పారు. 

పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై కూడ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చించింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఈ ఏడాది జూన్ 23న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. జూన్ 7 నాటికి  నామినేషన్ల దాఖలుకు చివరితేదీగా నిర్ణయించారు. అయితే పోలింగ్ తేదీపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో  ఈ తేదీలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు ఆ పార్టీ నాయకత్వం.