బీజేపీకి.. పీడీపీకి ఎందుకు చెడింది...?

complete analysis on BJP pulls Out Of Aliance with PDP
Highlights

బీజేపీకి.. పీడీపీకి ఎందుకు చెడింది...?

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. కశ్మీర్ లోయలో శాంతిభద్రతలు కాపాడటంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విఫలమయ్యారని ఆరోపిస్తూ..భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. అసలు ఈ బంధం బీటలు వారటానికి కారణాలేంటి అంటే.. 

కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ కల.. కానీ గడిచిన ఎన్నికల్లో అధికారానికి అడుగు దూరంలో ఆగిపోవడంతో.. పీడీపీ మద్ధతుతో తొలిసారి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ముఖ్యమంత్రిగా ముఫ్తీ మెహమ్మద్ సయిద్, ఉప ముఖ్యమంత్రిగా నిర్మల్ సింగ్ ప్రమాణం చేశారు. అయితే అనారోగ్య కారణాలతో ముఫ్తీ మొహమద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ  ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదని ఆమె కొద్దిరోజుల్లోనే తెలుసుకున్నారు.. అసంతృప్తులను బుజ్జగిస్తూ బండి లాగిస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలోని విభేదాలు ఈ ఏడాడి మొదట్లో తొలిసారిగా బయటపడ్డాయి.

షోపియాన్ జిల్లాలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించిన ఘటనలో మేజర్ సహా, ఆర్మీ సిబ్బందిపై జమ్మూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై సీరియస్ అయిన బీజేపీ ఆ ఎఫ్ఐఆర్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్  చేసింది.. దీనిపై అసెంబ్లీ అట్టుడికింది.. అలా పీడీపీ-బీజేపీ బంధం తెగిపోవడానికి తొలి బీజం పడింది..  ఇక ఈ రంజాన్ మాసంతో ఇరు పార్టీల మధ్య ఉన్న మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఈద్ సందర్భంగా భారత సైన్యాన్ని కొద్దిరోజుల పాటు కాల్పుల విరమణ చేయించి.. ప్రజలు ప్రశాంతంగా పండుగ చేసుకునేలా చేయాలని సీఎం ముప్తీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు..

ఆమె విన్నపంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ కాల్పుల విరమణకు పచ్చజెండా ఊపింది. అయితే ఈ మాసంలో గతంలో జరిగిన దానికి రెట్టింపు హింస జరిగింది.. ది రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ సుజాత్ భుకారీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో పాటు.. పండుగకు ఇంటికి వెళ్తున్న జవాను ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు.. దీంతో ఒక్కసారిగా శాంతిభద్రతలు అదుపు  తప్పడంతో కాల్పుల విరమణను పక్కనబెట్టి.. ఉగ్రవాదులను ఏరివేయాలని కేంద్ర హోంశాఖ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది..

కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించి శాంతి చర్చలు జరిపి ఉంటే.. కశ్మీర్‌లో శాంతి వెల్లివిరిసేదని భావిస్తున్న పీడీపీకి కేంద్ర నిర్ణయం ఏ మాత్రం రుచించలేదు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా సైన్యానికి ఆదేశాలు జారీ చేయడంపై సీఎం ముఫ్తీ జీర్ణించుకోలేకపోయారు.. ఈ నిర్ణయం కారణంగానే రాష్ట్రంలో పరిస్థితులు మరోసారి అదుపు తప్పాయని ఆమె భావించారు.. ఇది ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుధ్దానికి దారి తీయడం వెంట.. వెంటనే జరిగిపోయాయి.. ఈ పరిణామాలతో రెండు పార్టీల బంధం తెగిపోతుందని మీడియాలో ప్రచారం జరిగింది..

ఈ నేపథ్యంలో ఉన్నపళంగా ఢిల్లీ రావాలని జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేలకు అమిత్ షా సమన్లు జారీ చేశారు. ఈ భేటీలో పీడీపీతో విడిపోతే వచ్చే పరిస్థితులపై చర్చించారు.. ప్రభుత్వం సాగుతున్న తీరుపైనా.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విధానాలపైనా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం.. సంకీర్ణం నుంచి తప్పుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు రావడంతో.. ఈ మాటకే ఓటేశారు అమిత్ షా.

హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే పదవులకు రాజీనామా చేశారు కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలు... ఈ నిర్ణయంపై పీడీపీ కూడా వెంటనే స్పందించింది.. సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.. చూస్తుంటే ఇరు పక్షాలు ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు.. మరి కశ్మీర్ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

loader