ఉరిశిక్ష అమలు విధానంపై పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

ఢిల్లీ : ఉరిశిక్ష అమలు చేసే పద్ధతి మీద కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఖైదీలకు అమలు చేస్తున్న ఉరిశిక్ష పద్ధతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వెల్లడించారు. 

సుప్రీంకోర్టు.. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే పద్ధతి సరైందేనా.. లేక వారికి శిక్ష అమలు చేయడానికి మరేవైనా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా? అనే వాటి మీద పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సలహా ఇచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

‘‘సమత’’అత్యాచారం, హత్య కేసు.. దోషులకు మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు..

అయితే, ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలని ఎంపిక చేసేందుకు కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం దీనిమీద చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సూచించిన దానిమీద కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. 

న్యాయవాది రిషి మల్హోత్రా గతంలో ఉరి తీసే పద్ధతికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో అక్కడి ఖైదీలకు ఉరిశిక్ష పడితే ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్షను అమలు చేస్తారని.. దానితో పోల్చి చూస్తే ఉరిశిక్ష అత్యంత క్రూరమైనదని, దారుణమైనదని అతను ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఈ పిటిషన్ మీద ఈ యేడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరిశిక్షకు బదులు ప్రత్యామ్నాయంగా మానవీయ పద్దతుల్లో ఏవైనా మార్గాలున్నాయా.. అనే అంశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికోసం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తన నిర్ణయాన్ని తెలిపింది. కాగా, దీనికి అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణను వేసవి సెలవుల తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.