కర్ణాటకలో తుఫాను బీభత్సం: ఇద్దరు మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం

Coastal Karnataka to witness more rains today
Highlights

కర్ణాటక కోస్తా తీరాన్ని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మెకును తుఫాను తాకిడికి ఇద్దరు మరణించగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

బెంగళూరు: కర్ణాటక కోస్తా తీరాన్ని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మెకును తుఫాను తాకిడికి ఇద్దరు మరణించగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరో 24 గంటలు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధక శాఖ కార్యాలయం తెలియజేస్తోంది. 

మంగుళూరు, ఉడిపి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాలు వరదల్లో చిక్కుకుని ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 

ఉడిపి, మంగళూరు జిల్లాల్లో పెను గాలులకు చెట్లు కూలిపోయాయి. పలు పట్టణాల్లో, గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో మెకున్ తుఫాను కేరళ రాష్ట్రాన్ని కూడా తాకే సూచనలున్నాయి. 

బురదనీరు ఇళ్లలోకి చేరుతున్న దృశ్యాలను మంగళూరు వాసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు దక్షిణ కన్నడ, ఉడిపిల్లో పాఠశాలలను మూసేశారు. బైకంపాడి పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల్లోకి నీరు వచ్చి చేరింది. మంగళూరు, బంత్వాల్ తాలూకాల్లో తుఫాను తాకిడి ప్రభావం తీవ్రంగా ఉంది. 

ఉడిపి జిల్లాలో 130 భవనాల దాకా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం కేరళ, కర్ణాటక రాష్ట్రాలపై పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి పరిస్థితిని సమీక్షించారు.  

loader