ప్రయాగరాజ్ మహా కుంభమేళాల్లో సిఎం యోగి ఆదిత్యనాథ్ శృంగేరి పీఠాధిపతిని కలిసి, కుంభ ఏర్పాట్ల గురించి వివరించారు.  

మహా కుంభ నగర్ : ప్రయాగరాజ్ పర్యటనలో భాగంగా శనివారం సిఎం యోగి ఆదిత్యనాథ్ దక్షిణ భారతదేశంలోని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతి జీ మహారాజ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ... శృంగేరి పీఠాధిపతి ప్రయాగరాజ్ కి రావడం చాలా ఆనందంగా ఉందని, ఆయన రాకతో మహా కుంభం పరిపూర్ణం అయిందని అన్నారు. సిఎం యోగికి దక్షిణాది సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన పీఠాదిపతి కుంభ స్వరూపంగా కొబ్బరికాయను అందించారు. సిఎం కూడా శంకరాచార్యులకు శాలువా కప్పి, పండ్లు ఇచ్చి సత్కరించారు.

కుంభ ఏర్పాట్ల గురించి సిఎం వివరణ

శృంగేరి పీఠాధిపతితో భేటీ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత దక్షిణ భారతంలోని శృంగేరి పీఠం నుంచి మహా కుంభానికి వస్తున్నారని, దీంతో కుంభ వైభవం మరింత పెరిగిందని అన్నారు. ఈ మహా కుంభంలో శృంగేరి పీఠాధిపతి 5 రోజులు ఉండడం మాకు ఆశీర్వాదం లాంటిదని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయని అన్నారు. కుంభ వంటి కార్యక్రమాన్ని గొప్పగా, దివ్యంగా నిర్వహించడంలో మీ సహాయం చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా సిఎం, కుంభ ఏర్పాట్లు, సాధువుల భాగస్వామ్యం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల రాక గురించి శంకరాచార్యులకు వివరించారు.

సిఎం ను ప్రశంసించిన శంకరాచార్యులు

కుంభ ఏర్పాట్ల గురించి సిఎం ఇచ్చిన సమాచారం పట్ల శృంగేరి పీఠాధిపతి సంతోషం వ్యక్తం చేశారు. కుంభ ఏర్పాట్లు, సౌకర్యాలను ప్రశంసించారు. సేవలు అందిస్తున్న వారిని ఆశీర్వదించారు. దక్షిణ పీఠ సంప్రదాయం గురించి సిఎం కి వివరించారు. 48 ఏళ్ల క్రితం తన గురువుగారు కుంభమేళాల్లో అమావాస్య రోజున స్నానం చేయడానికి వచ్చారని, కానీ అధికారికంగా దక్షిణ భారతం నుంచి శంకరాచార్యులు 150 ఏళ్ల తర్వాత కుంభమేళాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. 5 రోజుల పాటు శాస్త్ర చర్చలు, అమావాస్య నాడు శంకరాచార్యులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేస్తానని చెప్పారు.

తన పర్యటన, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. కాశీ పర్యటన సందర్భంగా శాస్త్ర చర్చలు, ప్రవచనాలు చేయాలని సిఎం కోరగా, శంకరాచార్యులు అంగీకరించారు. అన్నపూర్ణ దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడానికి కూడా శంకరాచార్యులు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో శంకరాచార్యుల కుంభ పర్యటన బాధ్యులు రాకేష్ శుక్లా, దక్షిణ భారత బాధ్యులు మురళి జీ తదితరులు పాల్గొన్నారు.

బాబా కళ్యాణ్ దాస్ జీ మహారాజ్ తో భేటీ

అంతకు ముందు సిఎం యోగి ఆదిత్యనాథ్ 19వ సెక్టార్ లోని శ్రీ కళ్యాణ్ సేవా ఆశ్రమానికి వెళ్లి సద్గురుదేవ్ బాబా కళ్యాణ్ దాస్ జీ మహారాజ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయి, వారితో ముచ్చటించారు. కుంభ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి కూడా చర్చించారు. 10 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ తర్వాత సిఎం తన తదుపరి కార్యక్రమానికి వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రం అమరకంటక్ లోని కళ్యాణ్ సేవా ఆశ్రమం 1977 నుంచి జనసేవ, సమాజసేవ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.