ప్రయాగరాజ్ మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
ప్రయాగరాజ్ మహాకుంభ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. 17 గంటల తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 30 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించింది.
25 లక్షల రూపాయల పరిహారం
ఈ ఘటనపై న్యాయమూర్తి హర్ష్ కుమార్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ప్రకటించారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరపనుంది. ఈ తొక్కిసలాట ఎలా జరిగింది? ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఇందులో ఏమయినా కుట్రకోణం దాగివుందా? అన్నది విచారణ కమిటీ తేల్చనుంది.
ఈ దుర్ఘటనపై సీఎం యోగి స్పందిస్తూ... పవిత్ర కుంభమేళాలో ఇలాంటి ఘటన జరగడం తనను చాలా బాధిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మౌని అమావాస్య పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. అఖాడా మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో 90 మందికి పైగా గాయపడగా, 30 మంది మరణించారు. గాయపడినవారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు... వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
