CM Yogi Adityanath: 100 రోజుల్లో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని సెలక్షన్ బోర్డుల అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామనీ, ఖాళీల జాబితాను సిద్ధం చేయాలని ఆయా విభాగాల‌కు సూచించారు. 

Uttar Pradesh: ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చారిత్రాత్మ‌క విజ‌యం సాధించి.. వ‌రుస‌గా రెండోసారి అధికారి చేప‌ట్టిన‌ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం ఉపాధి క‌ల్ప‌న పై దృష్టి సారించిన స‌ర్కారు.. ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే రానున్న 100 రోజుల్లో రాష్ట్రంలోని 10,000 మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్ర సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అధికారుల‌ను ఆదేశించారు.

"రాబోయే 100 రోజుల్లో రాష్ట్రంలోని 10,000 మందికి పైగా యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్వీస్ సెలక్షన్ బోర్డులకు ఆదేశాలు ఇచ్చింది" అని ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ప్ర‌స్తుత నివేదిక‌ల ప్ర‌కారం.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేసి, తాజా రిక్రూట్‌మెంట్ల ప్రక్రియను త్వరలో ప్రారంభించాలని సీఎం అధికారుల‌కు సూచించారు. నియామ‌కాల్లో పారదర్శకతను కొనసాగించాలని మరియు పరీక్షల నిర్వహణ కోసం ఏజెన్సీల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే అన్ని రిక్రూట్‌మెంట్‌లను గడువులోపు పూర్తి చేయాలని చైర్‌పర్సన్‌లను ఆదేశించారు.

Scroll to load tweet…

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామ‌నే విష‌యాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ గుర్తు చేశారు. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఖాళీల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ రంగ అధికారులను ఆదేశించారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో నిజాయితీగా పని చేయాలని ప్రభుత్వ శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవ‌ల జ‌రిగిన మొద‌టి క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే ఉచిత రేషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.3,270 కోట్లు వెచ్చించనుందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. 

కాగా, 

ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగ‌గా.. ఈ నెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌బ‌డ్డాయి. ఇందులో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర ప‌క్షాలు18 స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టనున్నది బీజేపీ. ఈ ఎన్నిక‌ల్లో అఖిలేష్ యాద‌వ్ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ కి 111 సీట్లు, దాని మిత్రపక్షాలకు కేవ‌లం 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ త‌రుణంలో అనేక రికార్డుల‌ను యోగి బ్రేక్ చేశారు.