Asianet News TeluguAsianet News Telugu

టపాసుల అమ్మకాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎంకె స్టాలిన్ లేఖ‌.. ఏమన్నారంటే.. ?

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సంద‌ర్బంగా అనుమతించదగిన నిబంధనల ప్రకారం.. పటాకుల అమ్మకాలను అనుమతించాలని కోరుతూ  ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. 

CM Stalin writes to CM Arvind Kejriwal to permit sale of firecrackers on Diwali
Author
First Published Oct 13, 2022, 11:52 AM IST

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పటాకులను పూర్తిగా నిషేధించవద్దని, అనుమ‌తించ‌ద‌గిన నిబంధ‌న ప్ర‌కారం.. పటాకుల అమ్మకాలను అనుమతించాలని ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం.. రాజధానిలో పటాకుల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని స్టాలిన్ కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో పటాకుల అమ్మకం, ఉత్పత్తి, వినియోగంపై పూర్తి నిషేధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. 

తమిళనాడులోని శివకాశి వార్షిక ఆదాయంలో 70% దీపావళి రోజున పటాకుల అమ్మకం ద్వారా వస్తుందని సీఎం స్టాలిన్ చెప్పారు. వారిని ఆర్థికంగా లాభపడేలా దీపావళి సంద‌ర్బంగా ఢిల్లీలో పటాకుల అమ్మకానికి అనుమ‌తి ఇవ్వాల‌ని  స్టాలిన్ కోరారు. మరే ఇతర రాష్ట్రం పటాకులపై పూర్తి నిషేధం విధించనప్పుడు ఢిల్లీలో ఎందుకు అన్ని ప్ర‌శ్నించారు. ప‌టాసుల అమ్మకాల‌కు అనుమ‌తిస్తే...శివకాశి చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. 

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి నగరం భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 6.5 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నార‌ని పేర్కొన్నారు. 

దీపావళి రోజున రెండు గంటల పాటు పటాకులు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందని స్టాలిన్ తెలిపారు. దీపావళి క్రాకర్స్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న తమిళనాడులోని ఒక వర్గానికి నష్టం కలిగించే విధంగా ఢిల్లీలో పటాకుల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్టాలిన్ పట్టుబట్టారు.

ఢిల్లీలో పటాకులపై నిషేధం 
 
దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపింది. బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం అన్నింటిపైన నిషేధం అమల్లో ఉంటుందని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. 

చలికాలం వస్తే చాలు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం భారీగా పెరుగుతున్నదనీ, కాలుష్యం స్థాయి భారీగా పెరగటం కారణంతో ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి. ఇటీవల.. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  ప్రస్తుతం ఢిల్లీలో పటాకులు కాల్చడం, అమ్మడంపై నిషేధం ఉందని, దీన్ని తొలగించాలని స్టాలిన్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios