Coronavirus: కరోనా విజృంభణ.. 1 నుంచి 12 తగరతుల స్కూళ్లు, కాలేజీల మూసివేత !
Coronavirus: దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. రాష్ట్రంలోని 1 నుంచి 12 తరగతి వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేస్తున్నటు ప్రకటించారు.
Coronavirus: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. రోజువారీ కరోన వైరస్ కేసులు పెరుగుతుండంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు, కాలేజీలను మూసివేశాయి. ఈ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ కూడా వచ్చి చేరింది. మధ్యప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా (Coronavirus) ఇన్‌ఫెక్షన్ కేసులకు సంబంధించి క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా కేసులు అధికం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. కరోనా వైరస్ కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారి(Coronavirus) రోజురోజుకూ తన ప్రభావం పెంచుకుంటున్న నేపథ్యంలో జనవరి 15 నుంచి జనవరి 31 వరకు.. రాష్ట్రంలోని 1-12 తరగతుల పాఠశాలలు, కాలేజీలు మూసివేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు.
అలాగే, వాణిజ్య, మతపరమైన సమావేశాలు అనే తేడా లేకుండా అన్నింటిని నిషేధిస్తామని చెప్పారు. ఎలాంటి ఊరేగింపు, ర్యాలీ, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు కూడా నిషేధించబడతాయని తెలిపారు. హాలు లోపల జరిగే కార్యక్రమాలకు సిట్టింగ్ సామర్థ్యంలో 50% మందితోనే నిర్వహించాలని తెలిపారు. రాజకీయ, మత, విద్యా, వినోదం తదితర కార్యక్రమాలన్నీ బహిరంగంగా నిర్వహిస్తే గరిష్ట సంఖ్య 250 మందికి మించకుండా ఉండాలని తెలిపారు. అయితే, భారీ ర్యాలీ, భారీ సభ, పెద్ద పెద్ద ఈవెంట్‌లు ప్రస్తుతానికి నిషేధించబడతాయని సీఎం వెల్లడించారు. అన్ని క్రీడా కార్యకలాపాలు ప్రేక్షకులు లేకుండా జరపడానికి అనుమతించారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు జనవరి 31 వరకు మూసివేయబడతాయి. జనవరి 20 నుంచి ప్రీ-బోర్డు పరీక్షలు నిర్వహించాలని, ఆ పరీక్షలను టేక్ హోమ్ పరీక్షలుగా నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా పాఠశాలల్లో వ్యవస్థను ఏర్పర్చుకోవాలని తెలిపారు. ఇదివరకు విధించిన నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.
కరోనా వైరస్ (Coronavirus) ప్రభావం పెరుగుతున్నదనీ, టీకాలు వేయించుకోవడంలో నిర్లక్ష్యంగా వద్దని అన్నారు. రాష్ట్రంలో 100 శాతం ప్రజలు టీకాలు వేయించుకోవాలని సీఎం చౌహాన్ (CM Shivraj Singh Chouhan) అన్నారు. పని కోసం బయటకు వెళ్లే వ్యక్తుల సంఖ్యను, వలస వచ్చిన వారి జాబితాలను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. టీకా కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులందరూ కరోనా టీకా కార్యక్రమ ప్రచారానికి సహకరించాలి. అందరి కృషి, సమిష్టి సహకారంతో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం చౌహాన్ అన్నారు. ఇంటింటి తలుపు తట్టి మరీ టీకాలు వేయాలని అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా బారినపడ్డవారికి వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా సోకిన హోం ఐసోలేషన్ ఉంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడం అత్యంత ముఖ్యమని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొవడానికి సిద్ధం కావాలని అధికారులతో సీఎం (CM Shivraj Singh Chouhan) అన్నారు.
ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ (madhya pradesh) లో ఆంక్షలు ఉన్నప్పటికీ, కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు తగ్గేలా కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 4755 మందికి కరోనా సోకింది. అధికంగా ఇండోర్‌లో 1291 మంది, భోపాల్‌లో 1008 మందికి కరోనా సోకింది. గ్వాలియర్, జబల్‌పూర్‌లో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్వాలియర్‌లో కొత్తగా 570 మంది, జబల్‌పూర్‌లో 349 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8,14,473కు పెరిగాయి. మరణాలు 10,543కు చేరాయి.