మహారాష్ట్ర ప్రభుత్వంలోకి ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేరికను స్వాగతించారు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. అజిత్ రాకతో డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్తా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యిందన్నారు. 

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు తెచ్చారు. ఉదయం తన వర్గం నేతలతో సమావేశమైన పవార్.. ఆ వెంటనే ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కి వెళ్లారు. తర్వాత అజిత్ పవార్ మరో 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఆయనే మాతో చేతులు కలిపారని మీడియాతో మాట్లాడారు.

అజిత్ రాకతో డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్తా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యిందన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవార్ మాతో చేతులు కలిపారని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి అజిత్ రాకను స్వాగతిస్తున్నామని.. ఆయనతో పాటు వచ్చిన నేతల అనుభవం మహారాష్ట్రను అభివృద్ధి దిశగా నడిపిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కేబినెట్ల సీట్ల పంపకం గురించి చర్చించడానికి ఇంకా సమయం వుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మా దృష్టంతా మహారాష్ట్ర అభివృద్ధిపైనే వుందని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. 

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేతలు.. 
1. ధనంజయ్ ముండే
2. ఛగన్ భుజ్‌బల్
3. దిలీప్ వాల్సే పాటిల్
4. అదితి తట్కరే 
5. హసన్ ముష్రీఫ్ 
6. అనిల్ పాటిల్ 
7. ఆత్రం ధర్మరావుబాబా భగవంతరావు
8. సంజయ్ బన్సోడే

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతో పాటుగా ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా అజిత్ పవార్‌కు దక్కే అవకాశం ఉంది. ఇక, ఎన్సీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అజిత్ పవార్‌కే ఉన్నట్టుగా ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్‌ వైపే ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు. ఆయనకు కేంద్రంలోని మోదీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Also Read: బిగ్ ట్విస్ట్, షిండే ప్రభుత్వంలోకి అజిత్ పవార్ వర్గం.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం..

గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై ఆయన అలకబూనినట్టుగా తెలుస్తోంది. అలాగే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతోనే శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ఎగరవేసినట్టుగా తెలుస్తోంది.