ప్రభుత్వ బడిలో దారుణం.. 10వ తరగతి బాలుడిపై నలుగురు టీచర్ల దాడి
Government School: తాజాగా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి బాలుడిపై నలుగురు టీచర్ల దాడి చేశారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన ప్రభుత్వ బడిలో చోటుచేసుకోగా.. బాలుడు పోలీసులను ఆశ్రయించడంలో నలుగురు టీచర్లపై కేసు నమోదైంది.

Class 10th Boy Brutally Beaten By 4 Teachers: ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి బాలుడిపై నలుగురు టీచర్ల దాడి చేశారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన ప్రభుత్వ బడిలో చోటుచేసుకోగా.. బాలుడు పోలీసులను ఆశ్రయించడంలో నలుగురు టీచర్లపై కేసు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని యమునా విహార్ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న బాలుడిపై నలుగురు స్కూల్ టీచర్లు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా పోలీస్ స్టేషన్ లో నలుగురు ఉపాధ్యాయులపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. 16 ఏళ్ల బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలియజేస్తూ.. బాలుడి తల్లి కవిత మాట్లాడుతూ, తన కుమారుడు రోజువారీగానే సెప్టెంబర్ 15న యమునా విహార్ లోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అయితే, తరగతి గదిలో ఉండగా, కిటికీ నుండి బయటకు చూసినందుకు ఒక ఉపాధ్యాయుడు అతన్ని దారుణంగా కొట్టాడని చెప్పారు.
అయితే, తన కుమారుడు ఉపాధ్యాయుడికి క్షమాపణలు చెప్పినప్పటికీ, అతన్ని తరగతి గది నుండి బయటకు గెంటేశారని పేర్కొంది. 16 ఏళ్ల ఆ విద్యార్థిని అదే ఉపాధ్యాయుడు పిలిపించి పాఠశాలకు చెందిన మరో ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి దారుణంగా కొట్టాడని బాలుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన విద్యార్థి మాట్లాడుతూ, 'నేను కిటికీలోంచి బయటకు చూస్తుండగా సర్ వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. నేను నొప్పిగా ఉందని చెప్పగానే, అతను నన్ను మూడుసార్లు చెంపదెబ్బ కొట్టాడు. 4-5 నిమిషాల తర్వాత మళ్లీ ఆయన నా దగ్గరకు రాగానే క్షమాపణలు చెప్పాను. కానీ అతను నన్ను మళ్లీ కొట్టి క్లాసు నుంచి గెంటేశాడని' చెప్పినట్టు ఏఎన్ఐ నివేదించింది.
ఆ తర్వాత తనను ఎన్సీసీ గదికి తీసుకెళ్లాడనీ, అతని ముగ్గురు స్నేహితులను (తోటి పాఠశాల ఉపాధ్యాయులు) పిలిచి.. ఆ తర్వాత నలుగురూ నన్ను తీవ్రంగా కొట్టారని విద్యార్థి చెప్పాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. తన్నారని చెప్పాడు. ఈ దాడిలో తన నడుము, ఛాతీలో గాయాలు అయ్యాయనీ, ముఖం ఉబ్బిందని చెప్పాడు. టీచర్లు తనపై ఈ విధంగా ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నలుగురు ఉపాధ్యాయులు తనను బెదిరించారని కూడా చెప్పాడు. అయితే బాలుడు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. ఛాతి, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని అతని తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.