పెళ్లికి వెళ్లే పని ఉండటంతో కుమార్తెను ఒంటరిగా ఇంట్లో ఉంచడానికి భయపడిన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. తీరా వారు పెళ్లి నుంచి తిరిగి వచ్చే సరికి ఇళ్లు తగలబడి కనిపించింది.

వివరాల్లోకి వెళితే.. ముంబై దాదర్ సబర్బన్‌లో శ్రావణి చవాన్ అనే అమ్మాయి కుటుంబం నివసిస్తోంది. ఆమె తండ్రి వకోలా పోలీస్ స్టేషన్‌లో నాయక్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. సోమవారం ఓ పెళ్లి వేడుక ఉండటంతో తల్లిదండ్రులు శ్రావణిని చదువుకోమని చెప్పి గదిలో ఉంచి ఇంటికి తాళం వేసి వెళ్లారు.

పెళ్లి ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి చూసే సరికి అపార్ట్‌మెంటులో మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. వెంటనే తాళం తీసి లోపలికి వెళ్లగా అప్పటికే తీవ్రగాయాల పాలైన కూతురు కనిపించింది.

వెంటనే శ్రావణిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లిన తర్వాత ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.

శ్రావణి మంటల్లో కాలిపోతూ సాయం కోసం హాహాకారాలు చేసినప్పటికీ అవి ఎవరికి వినిపించలేదు. దీనికి తోడు ఇంటికి తాళం వేసి వుండటంతో ఎవరు లేరని స్ధానికులు భావించారు.