కర్ణాటకలోని బగల్ కోట్ లో రెండు వర్గాల మధ్య గొడవ హింసాత్మకంగా మారింది. స్థానికంగా ఉన్న పలు దుకాణాలకు నిప్పుపెట్టారు. పలువురు కత్తిపోట్లకు కూడా గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు.
కర్ణాటకలోని బాగల్ కోట్ లో బుధవారం సాయంత్రం రెండు వేర్వేరు వర్గాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది హింసకు దారి తీసింది. దీంతో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. బాదామి సమీపంలోని కెరూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో వారిలో కొందరు పలు దుకాణాలను, బైక్ లను, పండ్లు, కూరగాయల వ్యాపారుల బండ్లను తగులబెట్టారు.
Udaipur killing : కన్హయ్య లాల్ కుమారులకు ప్రభుత్వం ఉద్యోగం.. రాజస్థాన్ కేబినెట్ నిర్ణయం
ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇరు వర్గాల నుంచి 18 మందిని అరెస్టు చేశారు. పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. ఘర్షణ జరిగిన వెంటనే దుండగులు మార్కెట్లోకి చొరబడి, బండ్లకు నిప్పంటించి, బైక్లను ధ్వంసం చేశారని బాగల్కోట్ డీసీ పి.సునీల్ కుమార్ తెలిపారు. అయితే శాంతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో లోకల్ అడ్మినిస్ట్రేటివ్ కెరూర్ లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.
ఈ ప్రాంతంలో జూలై 8 ఉదయం 8 గంటల వరకు 144 సెక్షన్ తో పాటు పలు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. బస్ స్టాండ్ వద్ద కొంతమంది యువకులు ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారని, దీంతో ఈ ఘర్షణ జరిగిందని నివేదికలు తెలిపాయి. ఇది మరో గ్రూపునకు కోపం తెప్పించింది. ఈ ఘర్షణలో హిందూ జాగరణ్ వేదిక సభ్యులు కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం. కత్తిపోట్లకు గురైన వారిలో హిందూ జాగరణ్ వేదిక జిల్లా కార్యదర్శి అరుణ్ కట్టిమణి, ఆయన ఇద్దరు అనుచరులు ఉన్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.
కోరిక తీర్చాలంటూ వెంటపడి, నిరాకరించిందని గొంతు కోశాడు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన..
కాగా శివమొగ్గలోని ఒక ముస్లిం విక్రేత దుకాణాన్ని కొందరు హిందూ గ్రూపుతో సంబంధం ఉన్న వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ శిరచ్ఛేదానికి నిరసనగా హిందూ సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హిజాబ్ వివాదం, హలాల్ మాంసం నిషేధ వివాదం వంటి అంశాలపై ఇటీవలి నెలల్లో కర్ణాటకలో హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
