గాల్వన్ లోయలో చైనా జెండా ఎగరేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గాల్వన్ లోయలో చైనా ఆర్మీ జాతీయ జెండాను ఎగరేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపారని చైనా అధికారిక మీడియా, ప్రతినిధులు ట్వీట్లు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని విమర్శించాయి. కాగా, చైనా భూభాగంలోనే అంటే.. వివాదరహిత ప్రాంతంలోనే చైనా జెండాను ఎగరేశారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: లడాఖ్‌లోని గాల్వన్ లోయ(Galwan Valley)లో చైనా ఆర్మీ పీఎల్ఏ(China Army) ఆ దేశ జాతీయ పతాకాన్ని(National Flag) ఎగరేసింది. నూతన సంవత్సరం రోజే(New year) జెండాను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చైనా అధికారిక మీడియా, ప్రతినిధులూ ఈ వీడియోలను పోస్టు చేశారు. గాల్వన్ లోయలో జెండా ఎగరేసి చైనా ప్రజలకు ఆర్మీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిందని పలువురు ట్వీట్లు వేశారు. గాల్వన్ లోయలో ఉభయ దేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో సుమారు 20 మంది భారత సైనికులు మరణించారు. 2020 జూన్ నుంచి గాల్వన్‌లో ఇంకా ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ మరోసారి కవ్వించే ప్రయత్నానికి దిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నాయి.
చైనా బలగాలు.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆ దేశ జెండా ఎగరేసిన వీడియోను చైనా అధికారిక మీడియా సంస్థ ట్వీట్ చేసింది. భారత్‌కు సమీపంలోని సరిహద్దులో గాల్వన్ లోయలో చైనా ఆర్మీ జెండా ఎగరేసిందని పేర్కొంది. ఒక్క ఇంచు భూమిని కూడా కోల్పోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, జనవరి 1వ తేదీన అక్కడి నుంచి చైనా ఆర్మీ నూతన సంవత్సర శుభాకాంక్షలను పంపారని వివరించింది. చైనా అధికారిక మీడియా ప్రతినిధి షెన్ షివే కూడా మరో వీడియోను ట్వీట్ చేశారు. 2022 సంవత్సరంలోకి ప్రవేశించిన తొలి రోజే గాల్వన్ లోయలో చైనా జాతీయ జెండా రెపరెపలాడిందని పేర్కొన్నారు. ఈ జాతీయ జెండా చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ఎందుకంటే.. ఇదే పతాకం బీజింగ్‌లని తియన్మెన్ స్క్వేర్‌లో ఆవిష్కరించారని వివరించారు. కాగా, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. గాల్వన్ లోయలో మన త్రివర్ణ పతాకం బాగుంటుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చైనాకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. ప్రధాని మోడీజీ.. దయచేసి మౌనం వీడండి అంటూ విమర్శించారు.
Also Read: గాల్వన్ హింసకు ఏడాది: లడఖ్ ప్రతిష్టంభన కారణంగా ప్రపంచంలో వచ్చిన భౌగోళిక రాజకీయ మార్పులు..
అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు ఇటీవలే చైనా పేరు మార్చి కొత్త పేర్లు పెట్టడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఘాటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని, ఇకపైనా ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 30వ తేదీన ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ వ్యవహారా శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడారు. ఇలాంటి పేర్లు మార్చే ఉదంతాలను ఇది వరకే చూశామని, ఇలా వ్యవహరించడం చైనాకు తొలిసారేమీ కాదని అన్నారు. 2017 ఏప్రిల్‌లోనూ ఇలాంటి వాటికే చైనా ఒడిగట్టిందని తెలిపారు. కానీ, వారంతా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు. అక్కడ పేర్లు పెట్టినంత మాత్రానా అరుణాచల్ ప్రదేశ్ స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని స్పష్టం చేశారు.
Also Read: పక్కా వ్యూహంతోనే గల్వాన్ దాడి: చైనా కుట్రను బయటపెట్టిన అమెరికా సంస్థ
ఆర్మీ వర్గాల అభిప్రాయం
గాల్వన్ లోయలో చైనా జాతీయ జెండా ఆవిష్కరణపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. గాల్వన్ లోయలో చైనా పతాక ఆవిష్కరణ.. ఇరు దేశాల మధ్య ఉన్న డీమిలిటరైజ్‌డ్ జోన్‌ను ఉల్లంఘించలేదని వివరించాయి. అంటే.. చైనా అధీనంలోని వివాదరహిత ప్రాంతంలోనే ఆ జెండాను ఆవిష్కరించారని పేర్కొన్నాయి. 2020 జూన్‌లో హింసాత్మక ఘర్షణలు జరిగిన ప్రాంతానికి దూరంగానే ఈ పతాకావిష్కరణ జరిగిందని వివరించాయి.
