చైనాలో తమ చదువులు కొనసాగించడానికి, పనులను తిరిగి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. వీరంతా చైనా వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంబసీ తాజాగా ప్రకటించింది. నేటి నుంచే తాము చైనా వీసాల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: కరోనా కారణంగా అర్ధంతరంగా చైనా నుంచి ఇండియాకు వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి సుమారు రెండు సంవత్సరాలుగా పడిగాపులు గాస్తున్నారు. కరోనా కారణంగా 2020 నవంబర్ నుంచి భారతీయులను తమ దేశంలోకి ప్రవేశించడానికి చైనా అనుమతించడం లేదు. వీసాలనూ ఇవ్వలేదు. కానీ, తాజాగా, భారతీయులు చైనా వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటన వచ్చింది. మన దేశంలోని చైనా ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా సమయంలో అనుసరించిన చైనా వీసా పాలసీని జూన్ 13వ తేదీ నుంచి అప్‌డేట్ చేయనున్నట్టు తెలిపింది. అంటే సోమవారం నుంచి చైనా వెళ్లగోరే భారతీయులు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది.

చైనా ఎంబసీ ప్రకటన ప్రకారం, చైనాలో పని కోసం, ప్రొడక్షన్ ఫీల్డ్‌లో బాధ్యతలను తిరిగి చేపట్టడానికి కుటుంబ సమేతంగా వెళ్లాలనుకునే విదేశీయులు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చైనా పౌరులు లేదా చైనాలో శాశ్వత నివాసుల కుటుంబ సభ్యులు వారిని కలుసుకోవడానికి వీసాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే.. చైనా పౌరుడు లేదా.. చైనా శాశ్వత నివాసి భార్య, తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు, పిల్లలు, పిల్లల భాగస్వాములు, సోదరులు, మనవళ్లు, మనవరాళ్లు, గ్రాండ్ పేరెంట్స్ అని అర్థం అని వివరించింది.

అయితే, టూరిజం, ఇతర వ్యక్తిగత పనుల కోసం వీసాలను తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలిపింది.

2020లో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు చైనాలో చదువుకుంటున్న అనేక మంది భారతీయ విద్యార్థులు, పని చేస్తున్న వారిని అర్ధంతరంగా ఇండియాకు రావాల్సి వచ్చింది. చైనా ప్రభుత్వం అక్కడ అన్ని యూనివర్సిటీలను మూసేయడమే కాదు.. విదేశీయుల వీసా నిబంధనలను కఠినతరం చేసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ వీసాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. తాజాగా, వారికి గుడ్ న్యూస్ చెబుతూ.. వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు భారత్‌లోని చైనా ఎంబసీ వెల్లడించింది.