పోక్సో యాక్ట్ పై జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలపై అఘాయిత్యాల గురించి ఇప్పటికీ చాలా మంది మౌనం దాలుస్తుంటారని, బయటకు చెప్పవద్దనే ఒక జాఢ్యం ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. కుటుంబ పరువును ఆలోచిస్తారని వివరించారు. వాటన్నంటిని వదిలిపెట్టాలని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించాలని, నేరస్తులు కుటుంబ సభ్యులైనా రిపోర్ట్ చేయాలని సూచించారు.
న్యూఢిల్లీ: పిల్లలపై లైంగిక దాడి ఇంకా బయటకు చెప్పని నేరంగానే ఉంటున్నదని, వీరి విషయంలో మౌనం దాల్చే సంస్కృతి కొనసాగుతున్నదని సీజేఐ డీవై చంద్రచూడ్ శనివారం తెలిపారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులో ఎక్కువగా నేరస్తులు పరిచయస్తులే ఉంటున్నారని వివరించారు. ఒక వేళ నేరస్తులు కుటుంబ సభ్యులే అయినా ఎలాంటి సంశయం లేకుండా రిపోర్ట్ చేయాలని కుటుంబాలను కోరారు. ఇటువైపుగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు నడుం బిగించాలని సూచించారు.
పోక్సో యాక్ట్ పై రెండు రోజుల నేషనల్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ మధ్య తేడాను బోధించాలని తెలిపారు. గతంలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్పేవారని, కార్యకర్తలు వీటికి బదులు సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ అని పేరెంట్స్ పిలవాలని పేర్కొంటున్నారని వివరించారు. గుడ్, బ్యాడ్ అంటే అది నైతిక విషయంగా మారి పిల్లలు చెప్పకపోవచ్చని తెలిపారు.
ప్రతిష్ట, మర్యాదలు వంటి సోకాల్డ్ విషయాలను వదిలిపెట్టాలని, పిల్లల ప్రయోజనాల ముందు వాటికి విలువ ఇవ్వరాదని కుటుంబాలను కోరారు. నేరస్తుడు కుటుంబ సభ్యుడే అయినా వెంటనే రిపోర్ట్ చేయాలని, అటు వైపుగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని వివరించారు.
పోక్సో యాక్ట్ 18 ఏళ్లలోపు అందరి పిల్లలపై జరిగే దాడులకు సంబంధించినదని అందరికీ తెలిసిందే అని, అందులో ముందస్తు అనుమతి తీసుకున్నారా? లేదా? అన్నది అక్కర్లేదని తెలిపారు. ఎందుకంటే.. 18 ఏళ్లలోపు పిల్లల కన్సెంట్‌ను కన్సెంట్‌గా పరిగణించలేమని వివరించారు.
పిల్లలు చెప్పేది జాగ్రత్తగా వినాలని సీజేఐ అన్నారు. పెద్దలకు ఉన్న పదజాలం వారికి ఉండకపోవచ్చని, వారికి ఉన్న వకాబులరీలోనే ఘటనను వివరించే ప్రయత్నం పిల్లలు చేస్తూ ఉంటారని తెలిపారు. ఒక్కోరు ఒక్కోలా చెబుతుంటారని వివరించారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారనేది, దాని మూల్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు. ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
