Vaccine Registration for Children: పిల్లలకు వ్యాక్సిన్.. జనవరి 1 నుంచే రిజిస్ట్రేషన్.. ఆ కార్డు ఉన్న చాలు..
పిల్లలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. టీకాలు వేయించుకోవడానికి 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు జనవరి 1 నుంచి CoWIN యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఉదయం తెలిపింది.
దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిల్లలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. టీకాలు వేయించుకోవడానికి 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు జనవరి 1 నుంచి CoWIN యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఉదయం తెలిపింది. పిల్లలు విద్యాసంస్థల ఐడీ కార్డులను (student ID cards ) ఉపయోగించి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని పేర్కొంది. ఆధార్, ఐడీ కార్డులు లేని పిల్లలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానిక ఈ అవకాశం ప్రయోజనకరంగా మారనుంది.
CoWIN చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గుర్తింపు కార్డులకు సంబంధించి అదనపు కార్డును జోడించాం. వ్యాక్సిన్ వేయించుకునే విద్యార్థులు వారి విద్యాసంస్థలు జారీ చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు పిల్లలు ఆధార్, ఇతర అవసరమైన ఐడీ కార్డులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు.
ఇక, భారత్‌లో పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్, జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు మాత్రమే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ టీకాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. అయితే 12 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక, జైకోవ్-డి వ్యాక్సిన్ విషయానికి వస్తే మూడు డోసుల్లో దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకాలో సిరంజిలు ఉపయోగించరు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ.. భారత్‌లో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరిగిపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించి మోదీ.. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు జనవరి 3 నుంచి టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ ప్రికాషస్ డోస్ ఇవ్వబడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. జనవరి 10 నుంచి ఇది ప్రారంభం కానుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు దేశాన్ని సురక్షితంగా ఉంచారని ప్రధాన మంత్రి అన్నారు. వారి అంకితభావం సాటిలేనిదని కొనియాడారు.. వారు ఇప్పటికీ కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే 60 ఏళ్లు పైబడిన ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ప్రికాషస్ డోస్ ఇవ్వనున్నట్టుగా మోదీ తెలిపారు.