ఆయన వృత్తిరిత్యా డాక్టర్. అప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. వీరిని కాదని మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను చంపేశాడు. తీరా... పోలీసులకు దొరికిపోతాను అని అనుమానం రాగానే.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు.. అనవసరంగా తానెక్కడ పోలీసులకు దొరికిపోతానో అనే భయంతో ఆమె  కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిక్ మంగళూరు జిల్లా కడలూరుకి  చెందిన రేవంత్ దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతనికి కవిత అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా వీరికి ఐదేళ్ల కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలోకి మరో స్త్రీ ప్రవేశించింది.

కొంత కాలం క్రితం బెంగళూరు రాజరాజేశ్వరి నగర జవరేగౌడ లేఔట్ లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ హర్షిత(32) తో రేవంత్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.  భార్యకు తెలీకుండా రేవంత్... హర్షితతో గడుపుతూ వచ్చాడు. అయితే.. ఎక్కువ సేపు తనతోనే గడపాలని హర్షిత ఈ మధ్య రేవంత్ ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.

భార్యని వదిలేసి తన వద్దకు రమ్మని పోరుపెట్టింది. దీంతో రేవంత్ కూడా భార్యను చంపేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో కవిత ఈనెల 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్యను ఎవరో హత్య చేశారని కడూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా రేవంత్‌ను అనుమానించలేదు. ఇదిలా ఉంటే గురువారం హత్యకు సంబంధించిన నివేదిక పోలీసులకు చేరింది. 

Also Read గ్యాంగ్ రేప్: యజమాని ఇంట్లో ఊడుస్తూ ప్రసవించిన బాలిక..

అందులో కవితకు మత్తు  ఇంజెక్షన్‌ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు బయటపడింది. దీంతో రేవంత్‌ను విచారణ చేయాలని అతని ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ను కూడా తెప్పించారు. దీంతో భయపడిన రేవంత్‌ శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మహత్యకు ముందు రేవంత్‌... హర్షితకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.  రేవంత్‌ ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర జవరేగౌడ లేఔట్‌లో నివాసం ఉంటున్న హర్షిత కూడా డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా... వీరి అక్రమ సంబంధం కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు  చిన్నారులు అనాథలుగా మారడం గమనార్హం.