Assembly Election Results 2022: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లో విచిత్రంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమిని చవిచూశారు.
Assembly Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఒక్క పంజాబ్ మినాహా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మెజారిటీ స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. అయితే, ఉత్తరప్రదేశ్ బీజేపీకి విచిత్రమైన ఘటన ఎదురవుతోంది. బీజేపీతో పాటు రాష్ట్రంలో ప్రధాన పార్టీ కాంగ్రెస్.. అలాగే, ఆప్ సైతం దీనిని ఎదుర్కొంటున్నది. అదే... ఆయా పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థుల పోటీలో వెనుకంజ వేస్తూ.. ఒటమి దిశగా ముందుకు సాగుతుండటం.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు పుష్కర్ సింగ్ ధామీ ఓటమి చవిచూశారు. రాష్ట్రంలోని ఖతిమా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ కప్రీ చేతిలో ఆయన ఓడిపోయారు. భువన్ చంద్ కప్రీకి 52 శాతం (44,479) ఓట్లు రాగా, ధామికి 37,425 ఓట్లు వచ్చాయి.
ఇదిలావుండగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. లాల్కువాన్ నియోజకవర్గంలో నుంచి బరిలోకి దిగిన హరీష్ రావత్.. బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ చేతిలో 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ కు 53 శాతం ఓట్లతో 44,851 ఓట్లు సాధించగా, హరీష్ రావత్ 28,251 ఓట్లు సాధించారు. అయితే, హరీష్ రావత్ ఓటమికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంధ్యా దళకోటి కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు, పాత పార్టీ లాల్కువాన్ నుండి సంధ్య దళకోటికి టికెట్ ఇచ్చినప్పటికీ, ఆ స్థానం నుండి హరీష్ రావత్‌ను పోటీకి దింపింది. ఈ మార్పుపై విసిగిపోయిన సంధ్య దళకోటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
హరీష్ రావత్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో హరీష్ రావత్ హరిద్వార్, కిచ్చా నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఇదిలావుండగా, ఎన్నికల బరిలోకి దిగిన ఆప్.. పెద్దగా ఫలితాలు రాబట్టలేకపోయింది. గంగోత్రి స్థానంలో నుంచి బరిలోకి దిగిన ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్ కొథియాల్ సైతం ఓటమి పాలయ్యారు. ఆయనకు 5,998 ఓట్లు రాగా, ఆయన పత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి సురేష్ చంద్ర చౌహాన్ చేతిలో 28,667 ఓట్లతో ఓడిపోయారు. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 48 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో ముందజలో ఉండగా, ఇతర పార్టీలు 4 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ దుమ్ములేపుతూ.. 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
