Assam CM Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్రంలో జిహాదీ కార్యకలాపాలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రం జిహాదీ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆరోపించారు.
Assam CM Himanta Biswa Sarma: అస్సాం జిహాదీ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధానిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిహాదీ కార్యకలాపాలు పెరిగిపోయాయని, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ ఇస్లాంకు చెందిన ఐదు మాడ్యూల్స్ కు లింకు ఉన్నట్లు వెల్లడించారు
యువతను తప్పుదోవ పట్టించేందుకు అన్సరుల్ ఇస్లాంకు చెందిన ఆరుగురు బంగ్లాదేశీయులు అస్సాంలో చోరబడ్డారనీ, ఈ ఏడాది మార్చిలో బార్‌పేటలో ఓ మాడ్యూల్‌ను ఛేదించే సమయంలో వారిలో ఒకరిని అరెస్టు చేశారని సీఎం బిస్వా శర్మ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇమామ్‌లు ప్రైవేట్ మదర్సాలలో చదువు పేరుతో ముస్లిం యువకులను మోసగించడం ఆందోళనకరమన్నారు.
తీవ్రవాద లేదా తీవ్రవాద కార్యకలాపాలకు జిహాదీ కార్యకలాపాలు చాలా భిన్నంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో చేరిన యువకులకు చాలా ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారనీ, ఇస్లామిక్ భావజాలాన్నిప్రచారం చేస్తారని, ఆ తర్వాత వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి విధ్వంసక కార్యకలాపాలల్లో పాల్గొంటారని ఆరోపించారు.
2016-17లో రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయులు COVID-19 మహమ్మారి సమయంలోనూ అనేక శిక్షణా శిబిరాలను నిర్వహించారనీ, వీరిలో ఇప్పటివరకు ఒక బంగ్లాదేశీయుడిని మాత్రమే అరెస్టు చేశామని, రాష్ట్రం వెలుపల నుండి ఎవరైనా మదర్సాలో ఉపాధ్యాయులుగా లేదా ఇమామ్‌లుగా మారితే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే అస్సాంలో ఇలాంటి 800 మదర్సాలను మూసివేసామనీ,. కానీ ఇప్పటికీ క్వామీ మదర్సాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ మదర్సాలపై ఓ కన్నేసి ఉంచాలని, అందులో ఏయే సబ్జెక్టులు బోధిస్తున్నారో గమనించాలని పౌరులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. .
మోరిగావ్‌లోని జామీఉల్ హుదా మదర్సాను విపత్తు నిర్వహణ చట్టం, యూఏపీఏ చట్టం కింద కూల్చి వేసినట్లు ఆయన తెలిపారు. అక్కడ చదువుతున్న 43 మంది పిల్లలను ఇతర పాఠశాలలకు తరలించినట్టు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న అల్‌ఖైదా మాడ్యూల్ నాయకుడు ముఫ్తీ మహ్మద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు 2017 లో భోపాల్ నుండి ఇస్లామిక్ లాలో డాక్టరేట్ చేసాడు.
అదే సమయంలో.. BSF అధికార పరిధిని పెంచాలనే డిమాండ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇప్పటికే బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌కి అన్ని విధాలా సాయం అందిస్తామనీ, తమ ప్రభుత్వం కూడా కేంద్ర సంస్థలతో కలిసి పని చేస్తుందని తెలిపారు.