Asianet News TeluguAsianet News Telugu

'రాజీనామా చేసే ప్రసక్తే లేదు..': మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ పదవీ విరమణ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే.. కేంద్ర నాయకత్వం అవసరమని భావిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాననీ అన్నారు. 

Chief Minister Biren Singh on Manipur violence KRJ
Author
First Published Jul 25, 2023, 11:26 PM IST

మణిపూర్ లో దాదాపు మూడు నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పరిస్థితి రావణకాష్టంలా మారిపోయి నిత్యం అల్లర్లతో రగులుతూనే ఉంది. ప్రతిరోజూ చెదురుమదురుగా ఏదో ఒక అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రావడంతో  ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతి పాలన విధించాలని, బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో సీఎం బీరెన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాలని బిజెపి తనను కోరవచ్చునని, మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని బీరెన్ సింగ్ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదనీ, కానీ.. కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే..తాను పదవిని వదిలివేస్తానని ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీరెన్ సింగ్ అన్నారు.

తాను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తను, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నారు. కేంద్ర నాయకత్వం ఎప్పటికైనా ఆదేశిస్తుందనుకుంటే.. దానిని తాను తూచూ తప్పకుండా ఆచరిస్తానని అన్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడటం, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమనీ, ఇప్పటి వరకు ఎవరూ తనని రాజీనామా చేయమని అడగలేదనిబీరెన్ సింగ్ అన్నారు. 

రాష్ట్రంలో అశాంతికి అక్రమ వలసదారులు, డ్రగ్ స్మగ్లర్లు కారణమని నిందించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, మణిపూర్‌లో కుకీలు, మెయిటీలు సహా 34 తెగలు ఉన్నాయని, ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఐక్యంగా ఉన్నారని, కానీ, కొందరు ర్యాలీ పేరుతో రాష్ట్రాన్ని తగులబెట్టారని ఆయన అన్నారు. మే 3న జరిగిన ఆదివాసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆగ్రహించారు.

తమ ప్రభుత్వం అక్రమ వలసదారులకు చెక్ పెట్టిందనీ, కానీ, ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల స్మగ్లర్లతో సహా బయటి నుండి వచ్చిన వ్యక్తులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.  మణిపూర్‌లో పరిస్థితిని ఎలా పరిష్కరించాలో, శాంతిభద్రతలను పునరుద్ధరించాలని తాము కట్టుదిట్టమైన ప్రణాళికలను రూపొందించామనీ, త్వరలోనే మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం ఈ దిశగా కృషి చేస్తున్నాయని, త్వరలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన అన్నారు. మహిళలపై నమోదైన అత్యాచారాలు, హత్యల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,068 ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. ఇప్పటి వరకూ ఒక అత్యాచార సంఘటన మాత్రమే నమోదైందని అన్నారు. గత వారం కార్ సర్వీస్ సెంటర్‌లో హత్యకు గురైన ఇద్దరు మహిళలపై అత్యాచారం జరగలేదని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios