బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ పోలీస్ క్యాంప్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  క్యాంపు ఏర్పాటును నిరసిస్తూ  గిరిజనులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే తమ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులకు దిగారని పోలీసులు తెలిపారు. మావోలు దాడి చేసిన తర్వాతే తాము కాల్పులను ప్రారంభించినట్టుగా పోలీసులు చెప్పారు.

సోమవారం నాడు ఉదయం నుండి పోలీసులు ఘటన స్థలంలోనే ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో  9 మంది చనిపోయారని స్థానిక గిరినులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై  పోలీసులు నిర్ధారించడం లేదు.   ఈ ప్రాంతంలో పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఐజీ గత వారంలో ప్రకటించారు. మావోల ఒత్తిడి మేరకు పోలీస్ క్యాంప్ ను నిరసిస్తూ గిరిజనులు నిరసనకు దిగారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయింది సామాన్య పౌరులా లేదా మావోయిస్టులా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని ఐజీ చెప్పారు. గత నెల 3వ తేదీన  భద్రతా బలగాలపై మావోలు జరిపిన దాడిలో 24 మంది మరణించారు. ఈ ఘటన ప్రదేశానికి 10 కి.మీ దూరంలోనే  పోలీస్ క్యాంప్ ఏర్పాటుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.