పెళ్లి చేసుకోకున్నప్పటికీ ఒక కూతురు తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను మెయింటెనెన్స్‌గా పొందవచ్చని ఛత్తీస్‌గడ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ అడాప్షన్స్, మెయింటెనెన్స్ యాక్ట్ దీనికి అనుమతి ఇస్తున్నదని వివరించింది. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకోకున్నప్పటికీ ఒక కూతురు తన తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఖర్చుల కింద డబ్బులు పొందే హక్కు కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్స్, మెయింటెనెన్స్ యాక్ట్ 1956 కింద కూతురుకు ఈ సౌలభ్యం ఉన్నదని వివరించింది. బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు
వెలువరించింది.
ఛత్తీస్‌గడ్ దుర్గ్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాజేశ్వరి వేసిన పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోని మహిళ కూడా తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను పొందవచ్చునని చెప్పింది. మార్చి 21వ తేదీన ఈ వ్యాఖ్యలు చేస్తూ న్యాయమూర్తులు గౌతమ్ భాదురి, సంజయ్ ఎస్ అగ్రావాల్‌ల ధర్మాసనం ఆమె వేసిన ప్లీని విచారించడానికి స్వీకరించింది. 2016 ఏప్రిల్ 22న ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జీ వెలువరించిన ఆదేశాలను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. పైన పేర్కొన్న చట్టం కింద సయోధ్య కుదర్చాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. కాబట్టి, ఈ పిటిషన్‌లోని అన్ని పక్షాలను ఫ్యామిలీ కోర్టులో హాజరు కావాల్సిందిగా పేర్కొంది.
ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిన రాజేశ్వరి తండ్రి భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి భాను రామ్. వివాహ ఖర్చుల కింద తనకు సుమారు రూ. 20 లక్షల మెయింటెనెన్స్‌ను తండ్రి నుంచి వచ్చేలా చూడాలని పేర్కొంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను 2016 జనవరి 7న కొట్టేసింది. పెళ్లి చేసుకోకున్నా.. తల్లిదండ్రుల నుంచి పెళ్లికి అయ్యే డబ్బులు వసూలు చేసుకోవచ్చునని ఏ చట్టమూ చెప్పడం లేదని పేర్కొంది.
తన తండ్రి భాను రామ్ త్వరలోనే రిటైర్ కాబోతున్నాడని, ఆయనకు రిటైర్‌మెంట్ డ్యూల కింద రూ. 55 లక్షల మేరకు వచ్చే అవకాశం ఉన్నదని పిటిషనర్ రాజేశ్వరి తన ప్లీలో పేర్కొంది. కాబట్టి, అందులో నుంచి సుమారు రూ. 20 లక్షల మేరకు తనకు దక్కేలా తండ్రి పని చేస్తున్న భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదేశించాల్సిందిగా కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. కానీ, ఫ్యామిలీ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టిపారేసింది.
దీంతో ఫ్యామిలీ కోర్టును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పెళ్లి చేసుకోకున్నప్పటికీ ఒక కూతురికి తల్లితండ్రుల నుంచి వివాహ ఖర్చులను పొందే అవకాశం ఉంటుందని, అవి పెళ్లి ఖర్చుల కిందికి కాకుండా.. మెయింటెనెన్స్‌గా చూడాలని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఆమె వాదనలను హైకోర్టు తాజాగా సమర్థించింది. అంతేకాదు, ఇది ప్రత్యేకమైన కేసుగా పేర్కొంటూ అన్ని లా బుక్స్‌లో ఈ కేసును చేర్చాలని సూచనలు చేసింది.
