ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, గవర్నర్ సహా 166 మంది సభ్యుల బృందం ప్రయాగరాజ్ మహా కుంభంలో పవిత్ర స్నానం చేశారు.  

దేశం నలుమూలల నుండి కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ మహా కుంభంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మంత్రివర్గాల తర్వాత ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ గవర్నర్, ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలో 166 మంది బృందం త్రివేణి సంగమంలో స్నానం చేసింది. ఇందులో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ మహా కుంభమేళాను ఇంత వైభవంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి సీఎం విష్ణుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. త్రివేణిలో స్నానం ఆచరించడంతో పాటు తన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సుఖ సంతోషాల కోసం ప్రార్థించారు. సీఎం విష్ణుదేవ్ సెక్టార్ 7లో ఉన్న ఛత్తీస్‌గఢ్ మండపానికి వెళ్లి తన రాష్ట్ర భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

చత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ భార్య కౌశల్యతో కలిసి వచ్చారు. గవర్నర్ రమణ్ డెకా, అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహా కుంభం 2025లో పవిత్ర స్నానం కోసం అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ అందరూ కలిసి పవిత్ర సంగమ స్నానం చేశారు.

ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ, నేడు మొత్తం రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చారని అన్నారు. మమ్మల్ని ఆహ్వానించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్నానం తర్వాత తన సోషల్ మీడియాలో ఆయన ఇలా రాసుకున్నారు, నేడు తీర్థరాజ్ ప్రయాగ్‌లోని త్రివేణి సంగమంలో మూడు కోట్ల ఛత్తీస్‌గఢ్ ప్రజల సుఖ సంతోషాల కోసం స్నానం చేసి, పుణ్యఫలం పొందానని రాసుకున్నారు. మహా కుంభం సనాతన ధర్మ దివ్యత్వం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అని, ఇక్కడ భక్తి అమృతంలా ఆత్మను బ్రహ్మతో కలుపుతుందని అన్నారు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నేతృత్వంలో, గవర్నర్ సహా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరం ఛత్తీస్‌గఢ్ శ్రేయస్సు, శాంతి, సమృద్ధి కోసం మహా కుంభంలో పవిత్ర స్నానం చేయడానికి రావడం ఛత్తీస్‌గఢ్ అదృష్టమని అన్నారు. 144 ఏళ్ల తర్వాత మహా కుంభంలో పవిత్ర స్నానం చేసే అవకాశం అదృష్టవంతులకే దక్కుతుందని అన్నారు.

మహా కుంభం 2025 మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. యోగి ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, దీనివల్ల భక్తులకు సులభంగా ప్రయాణం, స్నానం చేసే వీలు కలిగింది. భద్రత, పరిశుభ్రత, నిర్వహణలో అద్భుతమైన ప్రయత్నాలు మహా కుంభాన్ని చారిత్రాత్మకంగా మార్చాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సనాతన సంస్కృతి ప్రేమికులను ఈ మహా కార్యక్రమం ఒక్కతాటిపైకి తీసుకువచ్చింది.