Chhattisgarh Election Results 2023 : ఛత్తీస్‌గఢ్ లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కాంగ్రెస్.. వెనుకంజలో బీజేపీ..
Chhattisgarh Election Results 2023 : 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారం దిశగా దూసుకుపోతోంది. బీజేపీ వెనుకబడింది.
Chhattisgarh Election Results 2023 : ఛత్తీస్ గఢ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ సారి ఎలాగైన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రస్తుతం వెనుకంజలోనే ఉంది. ఉదయం 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యింది. అనంతరం ఈవీఎంల ద్వారా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా ముఖ్యమంత్రి బఘేల్ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తారని అంచనా వేశాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్
కాగా.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 57 స్థానాలతో ముందంజలో ఉంది. బీజేపీ 33తో వెనుకబడిపోయింది. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో అంబికాపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ స్థానంలో ఆయన ఆధిక్యం కనబరుస్తున్నారు. అలాగే సీఎం భూపేష్ బఘేల్ పటాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. అక్కడ ఆయన వెనకంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు సాయంత్రం వరకు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలల్లో ఛత్తీస్ గడ్ కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు వెల్లువెత్తాయి. దీనిని కప్పిపుచ్చడానికి ఈ ఏడాది జూన్ లో సీఎం భూపేష్ బఘేల్ కు ప్రధాన ప్రత్యర్థి అయిన రాష్ట్ర మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో పార్టీ ఐకమత్యంతో ఎన్నికల బరిలోకి దిగింది.
90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని అంచనా వేశాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ బీజేపీకి 36-48 సీట్లు, కాంగ్రెస్ కు 41-53 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. అలాగే ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 36-46 సీట్లు, కాంగ్రెస్ కు 40-50 సీట్లు వస్తాయని తెలిపాయి. జన్ కీ బాత్ బీజేపీకి 34-45, కాంగ్రెస్ కు 42-53 సీట్లు వస్తాయని అంచనా వేసింది.