అసెంబ్లీ ఎన్నికల వేళ దారుణ హత్య.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత అంబాగర్ చౌకీ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు బిర్జు తారామ్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టు ప్రభావిత అంబాగర్ చౌకీ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు బిర్జు తారామ్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఔంధీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ఖేడా గ్రామంలో శుక్రవారం సాయంత్రం బిర్జు తారామ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రత్న సింగ్ తెలిపారు. బిర్జు తారామ్ తన ఇంటి వెలుపల నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. అయితే ఈ దాడిలో మావోయిస్టుల ప్రమేయం ఉందా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందని ఇప్పుడే నిర్దారణకు రాలేమని ఎస్పీరత్న సింగ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహ్లా-మన్‌పూర్‌తో పాటు 19 ఇతర నియోజకవర్గాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది.
అయితే ఈ ఘటనకు సంబందించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించాలని ప్రజలను కోరుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు భయపడరని, వారి బలిదానం వృధాగా పోనివ్వమని బీజేపీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు.