భారత బాలల హక్కుల కార్యకర్త లలిత నటరాజన్‌కు అమెరికా కార్మికు శాఖ యేటా ఇచ్చే ఇక్బాల్ మాసిహ్ అవార్డు వరించింది. ఆమె ఎందరో బాల కార్మికులకు విముక్తి ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించి మే 30వ తేదీన చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్‌లో ఈ అవార్డును ప్రసాదించారు. 

న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన న్యాయవాది, కార్యకర్త లలిత నటరాజన్ అమెరికా కార్మిక శాఖ ప్రదానం చేసే ఇక్బాల్ మాసిహ్ అవార్డు 2023ను గెలుచుకున్నారు. బాల కార్మికుల సమస్యను తొలగించడానికి పాటుపడిన కార్యకర్త నటరాజన్‌కు ఈ అవార్డును చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్‌లో కాన్సుల్ జనరల్ జుడిత్్ రావిన్ ఓ కార్యక్రమంలో మే 30వ తేదీన ప్రదానం చేశారు.

దక్షిణ భారతంలో బాల కార్మిక సమస్యను రూపుమాపడానికి ఒక సారథిగా పని చేస్తున్న నటరాజన్.. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిలో ఇరుక్కుపోయిన బాలలను గుర్తించి ప్రధాన స్రవంతిలోకి తెస్తున్నారని యూఎస్ కాన్సులేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

తమిళనాడు, సోషల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (నార్త్ జోన్) సభ్యురాలిగా ఉన్న లలిత నటరాజన్ చైల్డ్ లేబర్ యాక్ట్, పోక్సో చట్టం కింద వర్తించే పరిహారాన్ని కూడా బాధితులకు అందడంలో సహాయపడుతున్నారు. బాల కార్మికుల సమస్యతోపాటు గృహ హింస, లైంగిక వేధింపులకు గురైన బాధితులకూ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయపరమైన సహకారం అందిస్తున్నారు.

ఈ అవార్డు తన పనిని మరింత నిబద్ధతతో చేయాలని, తనపై మరింత బాధ్యతను పెంచిందని నటరాజన్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలిగా తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థ, పోలీసులతో దగ్గరగా పని చేస్తున్నారని, బాలల హక్కులకు విఘాతం కలుగకుండా పాటుపడతానని వివరించారు. ఇలా అనేక సమస్యలను విముక్తి చేసిన బాలలు తమ జీవితం శాంతియుతంగా గడపడానికి పోరాడుతానని తెలిపారు.

Also Read: అస్సామీ ముస్లింల ప్రత్యేక అస్తిత్వం, భిన్న సంస్కృతి.. హిందు, ముస్లిం తేడా లేదు..!

భారత బాల కార్మికులు, బలహీనవర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం ఆమె కృషి చేశారని కాన్సుల్ జనరల్ రావిన్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె తమిళనాడులోని అనేక పరిశ్రమల్లో బాలకార్మికులుగా మగ్గుతున్న పిల్లలకు విముక్తి ప్రసాదించారని వివరించారు. ఈ అవార్డు లలిత నటరాజన్ కృషిని గుర్తిస్తుందని చెప్పారు. వందలాది మంది పిల్లల జీవితాల్లో మార్పును తెచ్చిన ఆ కృషి గొప్పదని పొగిడారు.