షియోపూర్ నుండి షాకింగ్ న్యూస్ వచ్చింది. కునో నేషనల్ పార్క్‌లో సోమవారం చిరుతపులి మృతి చెందింది. ఈ ఆడ చిరుతను నమీబియా నుంచి తీసుకొచ్చారు.

భారతదేశంలో చిరుతలను పునరావాసం చేయాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాషా అనే ఆడ చిరుత సోమవారం ఉదయం కునో నేషనల్ పార్క్‌లోని తన ఎన్‌క్లోజర్‌లో చనిపోయి కనిపించింది. ఆ చిరుత కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్య, డీహైడ్రేషన్‌ కారణంతో చనిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. అంతకుముందు జనవరిలో సాశా అస్వస్థతకు గురై చికిత్స పొందింది. అప్పట్లో వైద్యులు, భోపాల్‌కు చెందిన వెటర్నరీ నిపుణుల బృందం పరిశీలనలో సాశా ఉంది. చిరుతలను మళ్లీ పరిచయం చేయాలనుకునే వన్యప్రాణుల ప్రేమికుల ఆశలను ఈ వార్త దెబ్బతీసింది.

జనవరి 22-23 తేదీలలో ఆడ చిరుత సాషాలో అనారోగ్యం యొక్క లక్షణాలు కనుగొనబడ్డాయి. ఆ తర్వాత పెద్ద ఎన్ క్లోజర్ నుంచి చిన్న ఎన్ క్లోజర్ లోకి మార్చారు. ఈ సమయంలో ఆ చిరుతకు చికిత్స చేయడానికి అటవీ శాఖ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ టీమ్‌ను కునోకు పంపింది. నిర్జలీకరణం , మూత్రపిండాల వ్యాధి ప్రారంభ లక్షణాలలో గుర్తించబడ్డాయి. సాషాను రక్షించేందుకు వాన్ విహార్ నేషనల్ పార్క్ నుండి డాక్టర్ అతుల్ గుప్తాను కూడా పంపించారు. నిపుణులు సమక్షంలో ఆ చిరుతకు ద్రవ పదార్థాలనే అందించారు. ఇది సాషా ఆరోగ్యంలో కూడా మెరుగుపడింది. కానీ..గత వారం నుంచి చిరుత ఆరోగ్యం క్షీణిస్తు వస్తుంది. చిరుతల్లో కిడ్నీ వ్యాధి సర్వసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాజెక్ట్ చీతాకు ఎదురుదెబ్బగా భావించకూడదని అంటున్నారు. 

నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆడ చిరుత సాశా బలహీనంగా ఉందని గుర్తించామనీ, సాశాకు వైద్య పరీక్షలు చేసి.. ప్రత్యేక ఆహారం అందించారు. అది బలహీనంగా ఉందని, మరింత వైద్యం అవసరమని భావించి మరిన్ని వైద్య పరీక్షలు చేయించామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) ప్రకాష్ కుమార్ వర్మ తెలిపారు. ఇది సాధారణమేనని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దానిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ రక్షించలేకపోయాం. నమీబియాకు చెందిన నిపుణులు కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఆ చిరుత మొదటి రోజు నుండి బలహీనంగా ఉందని తెలిపారు

నమీబియా నుంచి మరో ఏడు చిరుతలతో పాటు సాషాను తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్క్‌లో ఈ చిరుతలను విడుదల చేశారు. 70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై చిరుత స్వేచ్చగా సంచరించడం ఇదే తొలిసారి. ఈ బ్యాచ్‌లో ఎనిమిది చిరుతలు ఉన్నాయి, వీటిని మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో వదిలారు. దీని తరువాత, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండవ బ్యాచ్‌ను భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ 12 చిరుతల్లో ఏడుగురు మగ, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. వారు ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు.