చంద్రయాన్-3.. జూలైలోనే చంద్రుడిపైకి ఎందుకీ ప్రయాణం..? ప్రయోగాన్ని మనం లైవ్ లో చూడాలంటే ఎలా ? పూర్తి వివరాలు
చంద్రయాన్ -3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో చందమామపైకి ప్రయాణం మొదలుకానుంది. దీని కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. లైవ్ టెలీకాస్ట్ లో సాధారణ ప్రజలు ఈ ప్రయోాగాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయయాత్రకు అయ్యింది. సాఫ్ట్ ల్యాండింగ్ తో చంద్ర యాత్రలను పూర్తి చేసిన దేశాల జాబితాలో భారత్ ను చేర్చేందుకు ఇస్రో చంద్రయాన్ -3ను నేడు ప్రయోగించనుంది. దీని కోసం ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
26 కిలోల టమాటాలు చోరీ.. కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
గతంలో 2019 జూలై 22వ తేదీన చంద్రయాన్ -2 మిషన్ ను ఇస్రో ప్రయోగించింది. ఈ సారి కూడా చంద్రయాన్ ను -3 జూలై నెలలో ప్రయోగిచనుంది. ఇదే నెలలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రతీ ఏడాదిలో ఈ సమయంలో భూమి, చంద్రుడు ఒక దానికి మరొకటి దగ్గరగా వస్తాయి. దీంతో ఈ సమయంలో ప్రయోగం చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనం వీక్షించవచ్చా ?
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ ప్రయోగాన్ని సాధారణ పౌరులందరూ వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఆ సంస్థ తన అధికారిక వెబ్ సైట్, అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో దీనిని లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన లింక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే.. మీరూ చంద్రయాన్ -3 ప్రయోగం ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు.
జీఎస్ ఎల్వీ ఎంకే3 తో ప్రయాణం..
బాహుబలి రాకెట్ గా పిలిచే జీఎస్ ఎల్ వీ మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పై ల్యాండర్ విక్రమ్ ను నింగిలోకి పంపనున్నారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్ఎం-3)గా నామకరణం చేసిన జీఎస్ఎల్వీ ఎత్తు 43.5 మీటర్లు. హెవీ లిఫ్ట్ సామర్ధ్యం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని 'ఫ్యాట్ బాయ్' అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇది ఇప్పటివరకు వరుసగా ఆరు విజయవంతమైన మిషన్లను పూర్తి చేసింది. ఇది మూడు మాడ్యూళ్ల మిశ్రమంగా ఉంటుంది. అందులో ఒకటి ప్రొపల్షన్ కాగా, మరొకటి ల్యాండర్, ఇంకోటి రోవర్ (ఇది ల్యాండర్ లోపల ఉంటుంది.
కాగా.. నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి భూమికి 170 కిలోమీటర్ల దగ్గరగా, 36,500 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకార చక్రంలో 5-6 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ల్యాండర్ తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్ వేగం పుంజుకున్న తర్వాత చంద్రుని ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లే వరకు నెల రోజుల పాటు ప్రయాణించి చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది.
ఆగస్టు 23-24 తేదీల్లో ల్యాండింగ్
మొత్తానికి ఈ వాహనం ప్రయాణానికి 40 రోజుల సమయం పడుతుంది. అనుకున్న స్థానానికి చేరుకున్న తర్వాత ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దిగడం ప్రారంభిస్తుంది. అంటే ఆగస్టు 23 లేదా 24న ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ల్యాండింగ్ అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. దాని చుట్టుపక్కల శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో నీరు ఉండే అవకాశం ఉంది.
సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత రోవర్ ల్యాండర్ మాడ్యూల్ నుంచి బయటకు వచ్చి చంద్రుని ఉపరితలాన్ని తన పేలోడ్స్ ఏపీఎక్స్ఎస్ - ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ ద్వారా అధ్యయనం చేస్తుంది. రసాయన కూర్పును తెలుసుకుని, చంద్రుడి ఉపరితలంపై అనాలసిస్ ను
మరింత పెంచడానికి ఖనిజాల కూర్పును అంచనా వేస్తుంది.
చంద్రయాన్-3 మిషన్ మూడు లక్ష్యాలు..
1. చంద్రుడి ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్ను ప్రదర్శించడం
2. చంద్రుడిపై రోవర్ కదలికలను ప్రదర్శించడం.
3. శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం.