చంద్రయాన్ -3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ పని చేస్తున్నాయి. ఇప్పటికే రోవర్ శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతూ చంద్రుడిపై అధ్యయనం మొదలుపెట్టింది. అలాగే ల్యాండర్ కూడా తనకు అమర్చిన చాస్టే పరికరంతో చంద్రుడి నేలను తవ్వి, అక్కడ ఉండే ఉష్ణోగ్రతలను ఇస్రోకు పంపించింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన చంద్రయాన్ -3 తన పని మొదలుపెట్టింది. మొట్ట మొదటి సారిగా విజయవంతంగా మన మూన్ మిషన్ ఇస్రోకు సైంటిఫిక్ డేటాను పంపించింది. ఈ డేటాను అందుకున్న ఇస్రో.. దానిని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) పేజీలో షేర్ చేసింది. జాబిల్లిపై స్థిరంగా ఉన్న విక్రమ్ ల్యాండర్ ఈ డేటాను పంపించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది.

విక్రమ్ ల్యాండర్ లో ఉన్న థర్మల్ ప్రోబ్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై, లోతులో ఉష్ణోగ్రత ఎలా మారుతుందో నమోదు చేసింది. 
చంద్రుడికి వాతావరణం లేదు. అలాగే ఉపరితలంపై ఉష్ణోగ్రత తీవ్రంగా మారుతుంది. ఈ వైవిధ్యాలను ఇస్రో గ్రాఫ్ రూపంలో అందించింది. చంద్రుడి ఉపరితలం లేదా సమీప ఉపరితలం ఉష్ణోగ్రత వైవిధ్యాలను వివిధ లోతుల్లో, ప్రోబ్ చొచ్చుకుపోయే సమయంలో నమోదు చేసిన గ్రాఫ్ వివరిస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవానికి ఇలాంటి ప్రొఫైల్ తయారు చేయడం ఇదే తొలిసారి. దీనిపై సమగ్ర పరిశీలన కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.

Scroll to load tweet…

కాగా.. చంద్రుడిపై ఊహించిన దానికంటే ఆశ్చర్యకరంగా ఉష్ణోగ్రత నమోదైందని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేషా వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. ఉపరితలంపై ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండొచ్చని తాము భావించామని, అయితే ఇది 70 డిగ్రీలు ఉందని చెప్పారు. 

విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన కీలక పరికరం చాస్టేలో 10 హై ప్రెసిషన్ థర్మల్ సెన్సర్లను అమర్చారు. ఇవి చంద్రుడి పై మట్టిని తవ్వి, ఉష్ణోగ్రత వ్యత్యాసాలను అధ్యయనం చేస్తాయి. చంద్రుడి ఉపరితలం మొదటి 10 సెంటీమీటర్ల థర్మోఫిజికల్ లక్షణాలను అధ్యయనం చేసే మొదటి ప్రయోగం ఇది. చంద్రయాన్ -3 మిషన్ చంద్రుడి వాతావరణం, నేల, ఖనిజాలకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి పంపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

చంద్రుడి ఉపరితలం పగలు, రాత్రి సమయంలో గణనీయమైన ఉష్ణోగ్రత వైవిధ్యాలకు లోనవుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు అర్ధరాత్రి సమయంలో 100 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోగా, మధ్యాహ్నానికి గరిష్ట ఉష్ణోగ్రతలు 100 డిగ్రీలు దాటుతాయి. సుమారు 5-20 మీటర్ల మందం కలిగిన సున్నితమైన చంద్ర ఉపరితల మట్టి అద్భుతమైన ఇన్సులేటర్ గా ఉంటుందని భావిస్తున్నారు. 

కాగా.. ఆగస్టు 23నవ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో దక్షిన ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. ఆ తర్వాత ఈ ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు. అయితే చంద్రయాన్ -3 ఇప్పటికే తన మూడు లక్ష్యాలలో రెండింటిని సాధించిందని ఇస్రో శనివారం తెలిపింది.