చంద్రయాన్-3 లో మరో కీలకఘట్టం ఇవాళ పూర్తైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్-3 నుండి విడిపోయింది. ఇక నుండి విక్రమ్ ల్యాండర్ స్వంతంగా చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.
:
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 లో మరో కీలక ఘట్టం గురువారంనాడు చోటు చేసుకుంది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. గురువారం నాటి నుండి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చుట్టూ స్వంతంగా తిరగనుంది.ఈ నెల 23న సాయంత్రం 05:47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని ఇస్రో ప్రకటించింది.చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ల్యాండైన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విక్రమ్ ల్యాండర్ విడిపోవడం వల్ల చంద్రుడి ఉపరితలానికి విక్రమ్ ల్యాండర్ మరింత చేరువగా వెళ్లనుందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.నెమ్మదిగా చంద్రుడికి దగ్గరగా వెళ్తూ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో తెలిపింది.
also read:మరోసారి వ్యోమనౌక కక్ష్య తగ్గింపు:చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్-3
చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేస్తే అమెరికా,రష్యా,చైనా తర్వాతి స్థానంలో ఇండియా నిలుస్తుంది. అయితే ఏ దేశం కూడ ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకలేదు. అయితే చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు.ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగించారు. ఐదు దఫాలు కక్ష్యను పొడిగించారు. ఐదో కక్ష్య పూర్తైన తర్వాత ఈ నెల 1వ తేదీన చంద్రుడి మార్గంలో చంద్రయాన్-3 ప్రవేశ పెట్టారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ని విజయవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత కక్ష్యలను క్రమంగా తగ్గించారు. ఈ క్రమంలోనే చంద్రుడి దగ్గరికి చంద్రయాన్-3 తీసుకు వచ్చారు.
