చంద్రయాన్-3 లో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో ఇవాళ విజయవంతంగా పూర్తి చేసింది. వ్యోమ నౌక కక్ష్యను తగ్గించింది. దీంతో చంద్రుడికి చంద్రయాన్- మరింత చేరువైంది.
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 లో మరో అంకాన్ని ఇస్రో బుధవారంనాడు విజయవంతంగా పూర్తి చేసింది. వ్యోమనౌక కక్ష్యను తగ్గించింది. దీంతో చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్ 3 చేరుకుంటుంది. చంద్రుడిపై 100 కి.మీ ఎత్తున కక్ష్యలోకి చంద్రయాన్ 3 ప్రవేశించిందని ఇస్రో ప్రకటించింది. ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో వ్యోమ నౌక కక్ష్యను మరోసారి తగ్గించారు. నిన్న కూడ వ్యోమ నౌక కక్ష్యను తగ్గించిన విషయం తెలిసిందే.ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయింది. ఈ నెల 23 వ తేదీన చంద్రుడిపై ల్యాండర్ అడుగు పెట్టనుంది. ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహారికోట స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన విషయం తెలిసిందే.
చంద్రుడి దగ్గరికి వ్యోమ నౌక వెళ్లేందుకు వీలుగా దశలవారీగా కక్ష్యలను తగ్గిస్తున్నారు.ఈ నెల 1వ తేదీన ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నెల 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది వ్యోమనౌక. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ నుండి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టారు. అంతరిక్ష నౌక కక్ష్యను 150 కి.మీX 177 కి.మీ తగ్గించింది ఇస్రో.ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుండి వర్టికల్ దిశకు మార్చడం అత్యంత క్లిష్ట ప్రక్రియగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగానే చంద్రయాన్ 3 సాగుతుంది. ఇదే తరహాలో చంద్రయాన్ సాగితే ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో వ్యోమ నౌక సాఫ్ట్ ల్యాండింగ్ చేయవచ్చనే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
