భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రయాన్-3 గురించి మరొక కీలక  అప్‌డేట్‌ను ఇస్రో పంచుకుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రయాన్-3 గురించి మరొక కీలక అప్‌డేట్‌ను ఇస్రో పంచుకుంది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆ మిషన్ లక్ష్యాలను మించిపోయిందని ప్రకటించింది. తమ కమాండ్‌తో విక్ర‌మ్ ల్యాండ‌ర్ మళ్లీ ఇంజిన్లను ఫైర్ చేసిందని.. ఆ త‌ర్వాత ఆ ల్యాండ‌ర్ 40 సెంటీమీట‌ర్ల మేర‌కు పైకి లేచి.. సుమారు 30 నుంచి 40 సెంటీమీట‌ర్ల దూరంలో సుర‌క్షితంగా ల్యాండ్ అయిన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. 

‘‘చంద్రయాన్-3 మిషన్: విక్రమ్ ల్యాండర్ మళ్లీ చంద్రుడిపై ల్యాండ్ అయింది’’ అని ఇస్రో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. ‘‘విక్రమ్ ల్యాండర్ దాని మిషన్ లక్ష్యాలను అధిగమించింది. ఇది హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆదేశానుసారం.. అది ఇంజిన్‌లను కాల్చి, ఊహించిన విధంగా దాదాపు 40 సెం.మీ ఎత్తుకు ఎగిరింది. తర్వాత 30 - 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది’’ అని ఇస్రో పేర్కొంది. 

సెప్టెంబర్ 3వ తేదీన దీనిని నిర్వహించినట్టుగా ఇస్రో తెలిపింది. ఇందుకు సంబంధించి విక్రమ్ ల్యాండర్ కెమెరాలో బంధించిన దృశ్యాలను కూడా ఇస్రో షేర్ చేసింది. ఇది ల్యాండర్ పైకి లేవడం.. తిరిగి కొద్ది దూరంలో సాఫ్ట్ ల్యాండింగ్‌ను అవుతుండగా తీసిన వీడియో. ఆ సమయంలో కొంత దుమ్ము, ధూళి లేవడం వీడియోలో కనిపిస్తుంది. 

Scroll to load tweet…

అయితే ఈ పరీక్షకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా కూడా ఇస్రో పేర్కొంది. భవిష్యత్తులో తిరిగి శ్యాంపిల్స్ తీసుకురావాల‌న్నా, మానవ సహిత మిషన్లను ఇది ఉత్సాహపరుస్తుందని తెలిపింది. ఇక, అన్ని వ్యవస్థలు సక్రమంగా నిర్వహించబడడ్డాయని..హెల్తీగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. ర్యాంప్‌, చేస్ట్‌, ఐఎల్ఎస్ఏ ప‌రిక‌రాలు ఫోల్డ్ అయ్యాయ‌ని.. ఈ ప‌రీక్ష తర్వాత విజయవంతంగా అవి య‌థాస్థితికి వచ్చాయని పేర్కొంది.