చంద్రయాన్ -3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టం పూర్తి చేసింది. రెండో, చివరి డీ బూస్టింగ్ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని శనివారం అర్థరాత్రి దాటిన తరువాత ఇస్రో ట్వీట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం తెల్లవారుజామున 1:54 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ పై 'డీ బూస్టింగ్' విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ విన్యాసంతో ల్యాండర్ విక్రమ్ చంద్రుడికి మరింత చేరువైంది. ఇది రెండవ 'డీబూస్టింగ్' ఆపరేషన్, చివరి కక్ష్యా విన్యాసం. ఈ కీలక ఘట్టం పూర్తి చేసి ల్యాండర్ విక్రమ్ కక్ష్యను 25 కిలోమీటర్లకు 134 కిలోమీటర్లకు కుదించారు.

ఈ విషయాన్ని శనివారం అర్థరాత్రి దాటాకా ఇస్త్రో అధికారికంగా వెల్లడించింది. ‘‘రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా ఎల్ఎమ్ కక్ష్యను 25 కిమీ x 134 కిలోమీటర్లకు తగ్గించింది. మాడ్యూల్ అంతర్గత తనిఖీలకు లోనవుతుంది. నిర్దేశిత ల్యాండింగ్ సైట్ వద్ద సూర్యోదయం కోసం వేచి ఉంది. 2023 ఆగస్టు 23న భారత కాలమానం ప్రకారం రాత్రి 17.45 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమవుతుంది’’అని ఇస్రో ట్వీట్ చేసింది.

Scroll to load tweet…

ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు తొలి డీపోస్టింగ్ నిర్వహించారు. విన్యాసం తర్వాత ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను 113 ×157 కిలోమీటర్లకు కుదించారు. ‘‘ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ ఎం) ఆరోగ్యం సాధారణంగానే ఉంది. ఎల్ఎమ్ విజయవంతంగా డీబూస్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది, ఇది దాని కక్ష్యను 113 కిమీ x 157 కిలోమీటర్లకు తగ్గించింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 20, 2023న చంద్రయాన్ -3 రెండో డీ బూస్టింగ్ ఆపరేషన్ జరగనుంది’’ అని ఆరోజు ఇస్రో ట్వీట్ చేసింది.

డీ బూస్టింగ్ అంటే ఏమిటీ ? 
చంద్రుని కక్ష్యలో ల్యాండింగ్ మాడ్యూల్ ను నెమ్మదింపజేసే ప్రక్రియను డీబూస్టింగ్ అంటారు. గత గురువారం ల్యాండర్ మాడ్యూల్ ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరు చేసిన మరుసటి రోజే మొదటి డీబూస్టింగ్ నిర్వహించారు. ల్యాండర్, విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలాన్ని తాకడానికి ప్రయత్నించనుంది. 

ఇది విజయవంతమైతే చంద్రయాన్-3తో చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. భారత వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది. జులై 14న చంద్రయాన్-3ని ప్రయోగించారు. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం), ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం), రోవర్ ఉన్నాయి. ల్యాండర్ చంద్రుడిపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, రోవర్ ను మోహరించగలదని, ఇది దాని కదలిక సమయంలో చంద్రుడి ఉపరితలంపై అంతర్గత రసాయన విశ్లేషణను నిర్వహిస్తుందని ఇస్రో తెలిపింది.