Chandrayaan-3 : భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఈరోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఈ మిషన్ విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా  భారత్ నిలిచింది. ఆ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది వీరే.. 

Chandrayaan-3 :  భారత అంక్షరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chadrayaan-3) మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనున్నది. ఈ క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా వేచిచూస్తోంది. దాదాపు 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) సిద్దమైంది. చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. ఈ మిషన్‌ కోసం పనిచేసిన శాస్త్రవేత్తల బృందాలకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం..

ఎస్‌ సోమ్‌నాథ్‌ భారతి - ఇస్రో ఛైర్మన్‌

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్‌కు సూత్రధారులలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఒకరు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 (సన్ మిషన్), గగన్‌యాన్ వంటి ముఖ్యమైన మిషన్లు ఊపందుకున్నాయి. ఆయన 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన అంతకముందు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. చంద్రయాన్‌-3 తోపాటు త్వరలో ఇస్రో ప్రారంభించనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్, సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్ బెంగళూరులో విద్యనభ్యాసించారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 వంటి విభాగాల్లో ఆయనకు అనుభవముంది.

పీ వీరముత్తువేల్‌ - చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

పి వీరముత్తువేల్ 2019లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇస్రో ప్రధాన కార్యాలయంలోని స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఆఫీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. చంద్రయాన్-2 మిషన్‌లో వీరముత్తువేల్ కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో రోవర్‌, ల్యాండర్‌ నిర్మాణం వంటి కీలక అంశాలను ఈయన పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు, మంగళయాన్‌ మిషన్‌లో కూడా భాగస్వామ్యం అయ్యారు. ఐఐటీ మద్రాసు నుంచి సాంకేతిక విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు.

డాక్టర్ కె కల్పన - చంద్రయాన్‌-3 డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

డాక్టర్ కల్పనా - చంద్రయాన్-3 మిషన్‌కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆమె గత 4 సంవత్సరాలుగా ప్రాజెక్ట్‌తో అనుబంధం కలిగి ఉంది. ప్రతి నిమిషం కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. చెన్నైలో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె ఆ వెంటనే ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఆమె భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ప్రాజెక్టు అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌ 

డా. ఉన్నికృష్ణన్ నాయర్ ఫిబ్రవరి 2022 నుండి కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వృత్తి రీత్యా ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన డాక్టర్ ఉన్నికృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రయాన్‌-3ని నింగిలోకి తీసుకెళ్లిన LVM3 రాకెట్ సృష్టికర్త. ఆయన స్పేస్ క్యాప్సూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ (SRE), PSLV, GSLV, LVM3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రాజెక్ట్ లో ఆయన, తన బృందంతో కలిసి కీలక పాత్ర పోషించారు.

డాక్టర్ ఎం శంకరన్ - డైరెక్టర్ , యూఆర్ఎస్ సీ

బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్. అంతరిక్షంలో ఉపగ్రహాల కోసం పవర్ సిస్టమ్‌లను నిర్మించడంలో డాక్టర్ శంకరన్‌కు నైపుణ్యం ఉంది. ప్రస్తుతం శంకరన్ దేశ అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసే బృందానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఫిజిక్స్ లో పట్టాభద్రుడైన శంకరన్‌.. గతంలో చంద్రయాన్‌-1, చంద్రయాన్‌-2 మిషన్‌లో కూడా సేవలందించారు.

డాక్టర్ వి నారాయణన్ - డైరెక్టర్‌, ఎల్‌పీఎస్‌సీ

తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్. లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్లు, క్రయోజెనిక్ ఇంజన్ల తయారీలో అతనికి అపార అనుభవముంది. చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి బాధ్యత వహించే థ్రస్టర్‌లను డాక్టర్ నారాయణన్ రూపొందించారు. క్రయోజెనిక్‌ ఇంజిన్లను రూపొందించడంలో ఆయనకు చాలా అనుభవముంది. 

బీఎన్‌ రామకృష్ణ - డైరెక్టర్‌, ఐఎస్‌టీఆర్‌ఏసీ 

బీఎన్‌ రామకృష్ణ .. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌సెంటర్‌ బెంగళూరు డైరెక్టర్‌గా ఆయన సేవలందిస్తున్నారు. విక్రమ్‌ ల్యాండింగ్‌ ప్రక్రియలో ‘17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’గా శాస్త్రవేత్తలు పిలిచే ప్రక్రియను ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌సెంటర్‌ నుంచే పర్యవేక్షిస్తారు. ఈ సెంటర్ సహాయంతోనే శాస్త్రవేత్తలు విక్రమ్‌ ల్యాండర్‌కు ఆదేశాలను పంపుతారు.