వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్
భారత జాతీయ చిహ్నం ముద్రలు చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై పడనున్నాయి. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వల్ల ఇది సాధ్యం కానుంది. రోవర్ జాబిల్లిపై అడుగుపెట్టిన వెంటనే మూడు సింహాల గుర్తు, అలాగే ఇస్రో లోగో ముద్రించనుంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని యావత్ భారతదేశం ఆసక్తితో గమనించింది. చంద్రయాన్ -3లో ఉన్న రోవర్ చంద్రుడిపై దిగి కేవలం డేటాను సేకరించడమే కాకుండా.. భారతీయులందరూ గర్వపడేలా మరో పని కూడా చేయనుంది. అదేంటంటే ?
విక్రమ్ అనే ల్యాండర్ ముందుగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ప్రజ్ఞాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. అది చంద్రుడిపై అడుగుపెట్టిన వెంటనే దాని వెనుక చక్రాలు చంద్రుడి ఉపరితలంపై అశోక సింహానికి అనుసరణ అయిన భారత జాతీయ చిహ్నం ముద్రలను వదిలిపెడుతుంది. మరో వైపు ఇస్రోలోగోను కూడా ముద్రిస్తుంది. రోవర్ చంద్రుడిపై తిరుగుతున్నంతసేపు ఈ ముద్రలు పడుతూనే ఉంటాయని ఇస్రో తెలిపింది. ఇది చరిత్రలో నిలిచిపోనుంది.
ఇస్రో చేపట్టిన మూడో చంద్రయాన్-2కి కొనసాగింపుగా చంద్రయాన్-3ను ప్రయోగించారు. చంద్రయాన్-2 పాక్షికంగా విఫలమైన నాలుగేళ్ల తర్వాత భారత్ చేపట్టిన మూడో లూనార్ మిషన్ ఇది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ అమర్చి, చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోతాయి.
చంద్రయాన్ 3 ప్రయోగానికి భారతదేశ సొంత రాకెట్ ఉమెన్ గా పేరుగాంచిన రీతూ కరిధాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆమె చంద్రయాన్ 3 మిషన్ మిషన్ డైరెక్టర్. ఏరోస్పేస్ నిపుణురాలు రీతూ కరిధాల్ కూడా మంగళ్ యాన్ మిషన్ లో భాగమయ్యారు. లక్నోకు చెందిన ఆమె బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థిని. చంద్రయాన్ 3 చంద్రుడిపైకి 42 రోజుల పాటు ప్రయాణించనుంది. 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుందని ఇస్రో అంచనా వేసింది.