చంద్రుడిపై దిగిన నాటి నుంచి తన పనిని విజయంతంగా పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పుడు విశ్రాంతి స్థితిలోకి వెళ్లిపోయాయి. విక్రమ్ ల్యాండ్ నుంచి అది 100 మీటర్లు కదిలింది. అక్కడి నుంచి డేటా సేకరించి, విక్రమ్ కు పంపగా.. అక్కడి నుంచి అది భూమికి చేరుకుంది.
అగ్రదేశాలకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చంద్రుడిపై దిగ్విజయంగా, సురక్షితంగా కాలుమోపిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. ఇప్పుడు అవి విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించారు. విక్రమ్ కూడా త్వరలో అదే మోడ్ లోకి వెళ్లనుంది.
విక్రమ్ ల్యాండర్ లోని ప్రజ్ఞాన్ రోవర్ మాడ్యూల్ ను 'స్లీప్ మోడ్'లో ఉంచినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం తెలిపింది. చంద్రుడిపై మళ్లీ ఈ నెల 22వ తేదీన సూర్యోదయం కానుంది. ఈ నేపథ్యంలో రోవర్ ను మళ్లీ నిద్రలో నుంచి మేల్కొలుపుతామని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.
‘‘రోవర్ తన పనులను పూర్తి చేసుకుంది. ఇప్పుడు దానిని సురక్షితంగా పార్క్ చేశాము. స్లీప్ మోడ్ లో ఉంచాము. ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ లు ఆఫ్ చేశాము. ఈ పేలోడ్ల నుంచి డేటాను ల్యాండర్ ద్వారా భూమికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయింది. 2023 సెప్టెంబర్ 22న వచ్చే సూర్యోదయానికి ఈ సోలార్ ప్యానెల్ కాంతిని అందుకునేలా రిసీవర్ ఆన్ లో ఉంచాము. ఇది మరో దఫా పనిని విజయవంతంగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే భారత్ లూనార్ అంబాసిడర్ గా అది ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది’’ అని ఇస్రో తెలిపింది.
ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇంకా పనిచేస్తున్నాయని, అయితే చంద్రుడిపై రాత్రిని తట్టుకోవాల్సిన అవసరం ఉన్నందున రాబోయే ఒకటి రెండు రోజుల్లో వాటిని స్లీప్ మోడ్ లో ఉంచే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్ 1 సన్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ల్యాండర్ నుంచి రోవర్ దాదాపు 100 మీటర్ల దూరంలో కదిలిందని తెలిపారు.
ఇదిలా వుండగా.. భారత్ మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ-క్లాస్ సోలార్ మిషన్ అయిన ఆదిత్య-ఎల్ 1 శనివారం శ్రీహరి కోట నుంచి దిగ్విజయంగా బయలుదేరింది. ‘‘రాకెట్ ఉపగ్రహాన్ని ఖచ్చితంగా దాని నిర్దేశిత కక్ష్యలో ఉంచింది. భారతదేశ మొదటి సౌర అబ్జర్వేటరీ సూర్యుడు-భూమి ఎల్ 1 పాయింట్ గమ్యస్థానానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అని ఇస్రో ప్రకటించింది. ఆదిత్య-ఎల్ 1 వ్యోమనౌక ఎల్ 1 పాయింట్ వద్ద సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీని కలవనుంది.
