చంద్రయాన్ 3 : విక్రమ్, ప్రజ్ఞాన్‌లను మేల్కోలిపే పనులు రేపటికి వాయిదా.. ఇస్రో ప్రకటన
చంద్రయాన్ మిషన్‌లో భాగంగా ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రేపటికి వాయిదా వేసింది.

చంద్రయాన్ మిషన్‌లో భాగంగా ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం సాయంత్రం ల్యాండర్, రోవర్‌లను పునరుద్ధరించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనిని శనివారం నిర్వహిస్తామని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నిలేష్ దేశాయ్ తెలిపారు.
కాగా.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆ వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ 105 మీటర్ల దూరం ప్రయాణించి అధ్యయనం చేసి సమాచారాన్ని కిందకు పంపింది. అయితే చంద్రుడిపై సూర్యాస్తమయం కావడంతో సెప్టెంబర్ 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను ఇస్రో స్లీప్ మోడ్‌లో వుంచింది. అయితే ఇవాళ్టీ నుంచి చంద్రుడిపై తిరిగి సూర్యోదయం కావడంతో నిద్రాణస్థితిలో వున్న ల్యాండర్, రోవర్‌లను తిరిగి యాక్టివేట్ చేసే పనిని చేపట్టాలని ఇస్రో భావించింది.
చంద్రుడిపై సూర్యాస్తమయం అయిన తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. దక్షిణ ధృవం వద్ద మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకుని రోవర్, ల్యాండర్ తిరిగి పనిచేస్తాయా అని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఈ రెండింటిని అనుకున్న ప్రకారం నిద్రలేపితే మాత్రం భారత్ మరో చరిత్ర సృష్టించినట్లే.