Asianet News TeluguAsianet News Telugu

అనూహ్యంగా చంద్రయాన్ ప్రయోగానికి బ్రేక్

జీఎస్‌ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. 

Chandrayaan-2 launch cancelled due to technical glitch
Author
Sriharikota, First Published Jul 15, 2019, 6:33 AM IST

శ్రీహరికోట: చంద్రయాన్ - 2 ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రయోగం ఆగిపోయినట్లు తెలుస్తోంది. బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ మార్క్‌3 ఎం1 ద్వారా అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే, సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు ముహూర్తం నిర్ణయించారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపేశారు. 

ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్‌-1 ద్వారా తొలి ప్రయత్నంలోనే జాబిల్లి కక్ష్యకు ఆర్బిటర్‌ను ఇస్రో విజయవంతంగా చేరవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌తోపాటు అక్కడి ఉపరితలంపై దిగే ల్యాండర్‌, రోవర్లు ఉన్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 6.51 గంటలకు షార్‌లో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.
 
చంద్రయాన్‌-2లో మొత్తం 13 పేలోడ్స్‌ ఉన్నాయి. ఆర్బిటర్‌లో 8, విక్రమ్‌ ల్యాండర్‌లో 3, ప్రగ్యాన్‌ రోవర్‌లో 2 ఉన్నాయి. వీటిల్లో ఐదు పేలోడ్స్‌ మన దేశానికే చెందినవి కాగా మూడు యూరప్‌, రెండు అమెరికా, ఒకటి బల్గేరియా దేశానికి చెందినవి. ఈ ప్రయోగానికి ఇస్రో రూ.978 కోట్లు ఖర్చు చేస్తోంది. రూ.375 కోట్లతో రాకెట్‌ను, రూ.603 కోట్లతో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్లను ఇస్రో తయారు చేసింది.
 
చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆదివారం సాయంత్రమే షార్‌కు చేరుకున్నారు. ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌, డైరెక్టర్‌ రాజరాజన్‌ ఆర్ముగం, కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios