Asianet News TeluguAsianet News Telugu

తొందర పడి ఓ కోయిల: కేసీఆర్ మీద చంద్రబాబు పైచేయి

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు బెంగళూరు వెళ్లి కేసిఆర్ అభినందించి వచ్చారు. మర్నాడు జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో వేదికను పంచుకున్నారు.

Chandrababu takes adavatage over KCR
Author
Hyderabad, First Published Nov 8, 2018, 6:06 PM IST

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో కలిసి పీపుల్స్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామని సంబరపడిపోయిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు ఆశలు గల్లంతవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన మీద పైచేయి సాధించారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామంటూ తొందరపడి హడావిడి చేసిన కేసిఆర్ అనివార్యంగా వెనకడుగు వేయాల్సిన స్థితిలో పడ్డారు. 

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు బెంగళూరు వెళ్లి కేసిఆర్ అభినందించి వచ్చారు. మర్నాడు జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో వేదికను పంచుకున్నారు. తద్వారా, కాంగ్రెసుకు అప్పుడే చంద్రబాబు దగ్గరయ్యారనే మాట వినిపించింది. అయితే, కేసిఆర్ కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కడుతామని చెప్పారు. ఇందుకు గాను ఆయన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి పలువురు నేతలతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కాంగ్రెసు లేని కూటమిని ఇతర పార్టీల నేతలు వ్యతిరేకించారు. బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెసును కూడా కలుపుకుని వెళ్లాల్సిందేనని మమతా, స్టాలిన్ వంటి ఇతర నేతలు కచ్చితంగానే చెప్పారు. 

తదుపరి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరైనట్లు కనిపించారు. ఎన్డీఎతో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు మోడీపై సమరం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలంతా చంద్రబాబుకు దగ్గరయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ మీద దాడి జరిగిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, కేజ్రీవాల్ వంటి నేతలను కలిశారు. చివరకు ఢిల్లీ రాహుల్ గాంధీని కలిసి చేతులు కలిపారు. దీంతో చంద్రబాబు బిజెపి వ్యతిరేక వైఖరి, బిజెపి వ్యతిరేక పార్టీలను కలుపుకుని వెళ్లాలనే చంద్రబాబు కచ్చితమైన వైఖరి వెల్లడైంది.

తాజాగా, కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో చంద్రబాబు జెడి(ఎస్) నేతలు దేవెగౌడ, కుమార స్వామిని అభినందించారు. అయితే, కేసిఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. కనీసం మాట వరుసకైనా కుమార స్వామిని గానీ దేవెగౌడను గానీ అభినందించినట్లు లేరు. చంద్రబాబు అభినందనలతో సరిపెట్టకుండా ఏకంగా బెంగళూరు వెళ్లి ఇరువురు నాయకులతో సమావేశమై జాతీయ కూటమి నిర్మాణంపై చర్చలు జరిపారు. పక్కాగా జాతీయ కూటమికి ఓ రూపం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. 

చంద్రబాబు రేపు (శుక్రవారం) చెన్నై వెళ్లి డిఎంకె నేత స్టాలిన్ ను కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిలో కేసీఆర్ పూర్తిగా శాసనసభ ఎన్నికల వ్యవహారాల్లో మునిగిపోయారు. చంద్రబాబు ఓ వైపు జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా నిర్మాత్మకమైన జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తూనే తెలంగాణలో కేసిఆర్ ఓటమికి వ్యూహరచన చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఓడించడానికి శతాబ్దాల కాంగ్రెసు వ్యతిరేక వైఖరిని చంద్రబాబు విడనాడాడు. కాంగ్రెసుతో జత కట్టి టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి తగిన మార్గనిర్దేశం చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్ల త్యాగానికి కూడా ఆయన తన పార్టీ తెలంగాణ నేతలను సిద్ధం చేశారు. మరోవైపు, బిజెపికి సన్నిహితంగా మెలుగుతున్నారని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెసు సహకారం తీసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.  

కాంగ్రెసు సహకారంతో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలనే చంద్రబాబు వైఖరికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు లభిస్తోంది. ఈ స్థితిలో కేసిఆర్ తలపెట్టిన పీపుల్స్ ఫ్రంట్ కు కాలం చెల్లినట్లే భావించవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios