ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాద్ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాద్ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లో కలిసి చంద్రబాబు.. ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన యూపీలోని సైఫాయ్‌కు చేరుకున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి ములాయం భౌతిక కాయం వద్ద నివాళులర్పించి.. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ములాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ములాయం అంత్యక్రియలకు హాజరైన అనంతరం.. చంద్రబాబు నాయుడు తిరుగుపయనం కానున్నారు. 

ఇక, ములాయం సింగ్ యాదవ్ మరణవార్త తెలిసి చాలా బాధపడినట్టుగా చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘నేను ఈ రోజు ప్రియమైన సోదరుడిని కోల్పోయాను. 4 దశాబ్దాలుగా, తన ఆకర్షణ, వినయం, భారత రాజకీయాలపై లోతైన అవగాహనతో నన్ను ఎల్లప్పుడూ ఆకట్టుకునే ఓబీసీ ప్రముఖుడు ములాయం సింగ్ యాదవ్‌తో ఎక్కువ సమయం గడిపే అదృష్టం నాకు లభించింది. ఆయన ఒక అరుదైన పెద్దమనిషి. మర్యాదపూర్వకంగా ఉండేవారు. నిశ్శబ్దంగా తన సోషలిస్ట్ లక్ష్యాలను సాధించడం ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చారు. తన ప్రయాణంలో ఎంతో ఇష్టపడే మాస్ లీడర్‌గా మారారు. అఖిలేష్ యాదవ్, ఆయన కుటుంబం, ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని చంద్రబాబు ములాయం మరణవార్త తెలిసిన అనంతరం ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని అతని స్వగ్రామమైన సైఫాయ్‌లో జరగనున్నాయి. సోమవారం సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని సైఫాయికి తరలించారు. 

సమాజ్‌వాదీ పార్టీ వర్గాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయానికి కడసారి వీడ్కోలు పలికేందుకు దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు సైఫాయ్‌కు చేరుకుంటున్నారు. యూపీ నలుమూలల నుంచి పెద్ద ములాయం సింగ్ యాదవ్ అభిమానులు పెద్ద ఎత్తున సైఫాయ్‌కు తరలివస్తున్నారు.