ఓ విడాకుల కేసులో భార్యకు భర్త అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. భరణంగా రూ.24,600 చిల్లరను ఇచ్చి లెక్కపెట్టుకోమన్నాడు.. దీంతో న్యాయమూర్తి కోర్టును వాయిదా వేసింది

ఓ విడాకుల కేసులో భార్యకు భర్త అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. భరణంగా రూ.24,600 చిల్లరను ఇచ్చి లెక్కపెట్టుకోమన్నాడు.. దీంతో న్యాయమూర్తి కోర్టును వాయిదా వేసింది. పంజాబ్-హరియాణా హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది అతని భార్య 2015లో ఓ న్యాయస్థానంలో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు భార్యకు నెలకు.. రూ. 25,000 భరణాన్ని చెల్లించాలని ఆదేశించింది.

కానీ తన దగ్గర అంత నగదు లేదని న్యాయవాది తేల్చి చెప్పడంతో భార్య హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గత రెండు నెలలుగా ఇవ్వని బాకీ భరణాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయస్థానం ఆదేశాలతో న్యాయవాది ప్రతినిధులు అతని భార్యకు నగదు ఉన్న బ్యాగ్‌ను అందజేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో అందరి ముందు తెరిచిన ఆమెతో పాటు న్యాయవాదులు, ఇతర కక్షిదారులు నిర్ఘాంతపోయారు.

బ్యాగ్ నిండా రూ.1, రూ.2 నాణేలతో పాటు నాలుగు వంద నోట్లు ఉన్నాయి. ఈ నగదును లెక్కించేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో న్యాయమూర్తి లెక్కించేందుకు గాను విచారణను వాయిదా వేశారు. అనంతరం ఆ మహిళ మాట్లాడుతూ... తనను వేధించేందుకే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శించింది.. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని తన భర్త చర్యపై మండిపడింది. భార్య వాదనపై స్పందించిన ఆయన భరణంగా రూ.100, రూ.500, రూ.2 వేల నోట్లే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.