మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. బీజేపీకి ఈడీ ఏటీఎంలాగ మారిందని ఆయన మండిపడ్డారు. మహా వికాస్ అగాఢి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
మహారాష్ట్రలో (maharashtra) శివసేన (shivsena) నేతలకు సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాలల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహిస్తోన్న సోదాలపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (sanjay raut) ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ సిండికేట్, ఈడీ అధికారుల దోపిడీ రాకెట్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు. ఈరోజు తమ పార్టీ వ్యక్తులపై సోదాలకు వచ్చిన అధికారుల్లో (ed officials) కొందరు తొందరలోనే జైలుకు వెళ్తారని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్, మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలను ఎంచుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా మహా వికాస్ అగాఢి ప్రభుత్వాన్ని (maha vikas aghadi) అస్థిరం చేయడానికి చేస్తున్న ప్రయత్నమేనంటూ సంజయ్ రౌత్ విమర్శించారు. ఈడీలో ఉన్న కొంతమంది అధికారులు బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈడీ ఏటీఎంలాగ మారిందని.. ఈ అధికారుల దోపిడీకి సంబంధించిన రికార్డులను తాను ప్రధానమంత్రికి అందించానని సంజయ్ రౌత్ తెలిపారు.
కాగా.. మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ (it raids) సోదాలు కలకలం రేపుతున్నాయి. శివసేన నేతలు, మహారాష్ట్ర మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరాబ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల ఈ దాడులు జరిగాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న శివసేన ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు రాహుల్ కనాల్ (Rahul Kanal) ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మహారాష్ట్రలోని 12 ప్రదేశాలలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మతేతో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మతేలకు శివసేన మంత్రి అనిల్ పరబ్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
‘మహారాష్ట్రపై ఇలాంటి దాడులు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి’ అని ఆదిత్య ఠాక్రే ఒక ప్రకటనలో తెలిపారు. ‘గతంలో కేంద్ర ఏజెన్సీలు ఇలాగే దుర్వినియోగం అయ్యాయి.. బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగే జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఈ కేంద్ర ఏజెన్సీలు బీజేపీకి ఒక విధంగా ప్రచార యంత్రాంగంగా మారాయి. కానీ మేం తలవంచము.. మహారాష్ట్ర తలవంచదు’ అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.
