వైద్యులు మందుల పేర్లు క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని, జనరిక్ మెడిసిన్స్‌నే రాయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ నిబంధనలు తరుచూ ఉల్లంఘిస్తే వైద్యుడి లైసెన్స్ కొంత కాలం సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: సాధారణంగా ఒక కుటుంబం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టేది ఒకటి వైద్యం, మరొకటి విద్య. వైద్యం ఆవశ్యకమైన అవసరం. ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఖర్చు పెట్టకతప్పదు. మెడిసిన్స్ కోసం డబ్బులు చెల్లిస్తూ చితికిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జనరిక్ ఔషధీలను తీసుకువచ్చింది. వైద్యులు జనరిక్ మందులనే రాయాలని గతంలోనే సూచించింది. కానీ, ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై తీసుకునే చర్యలేవీ లేకపోవడంతో ఈ నిబంధనల ప్రభావం అంతంతమాత్రంగానే ఉండిపోయింది. తాజాగా, కేంద్రం ఈ నిబంధనలు కఠినతరం చేసింది. మందుల పేర్లు స్పష్టంగా రాయాలని, అంటే పేర్లను క్యాపిటల్ లెటర్ రాయాలని పేర్కొంది. జనరిక్ మెడిసిన్సే రాయాలని స్పష్టం చేసింది. తరుచూ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైతే సదరు వైద్యుడి లైసెన్స్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (NMCRMP) పేరుతో కొత్త నిబంధనలు జారీ అయ్యాయి.
2002లో భారత వైద్య మండలి కొన్ని నిబంధనలు జారీ చేసింది. దాని ప్రకారం, ప్రతి వైద్యులు జనరిక్ మందులను సూచించాలని ఆదేశించింది. కానీ, ఉల్లంఘనులపై తీసుకునే చర్యలేవీ పేర్కొనలేదు. దీంతో తాజాగా ఎన్ఎంసీఆర్ఎంపీ కొత్తగా నియామవళిని వాటి స్థానంలో తెచ్చింది. ఇందులో ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చిరికలు చేసింది.
Also Read: ‘పుష్ప’ ఫీవర్ తగ్గేదేల్యా.. సింగిల్ పోస్టర్‌తో ఆల్ ఇండియా రికార్డ్, పుష్పా!
ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రోగులకు జనరిక్ పేర్లతో ఔషధాలు రాయాలని, అవసరం లేదని మందులను, అక్కర్లేని ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ మాత్రలను రాయొద్దని పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వర్క్ షాపులకు హాజరు కావాలని ఆదేశించే అవకాశాలు ఉంటాయని వివరించింది. అంతేకాదు, తరుచూ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు వైద్యుడి లైసెన్స్ కూడా కొంత కాలం సస్పెండ్ చేసే అవకాశం ఉన్నదని తెలిపింది. మందులు రాసే చిట్టీలో మెడిసిన్స్ పేర్లను క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలని జాతీయ వైద్య కమిషన్ పేర్కొంది. జనరిక్ మందుల ధరలు 30 నుంచి 80 శాతం తక్కువ ధరతో ఉంటాయి కాబట్టి, పేదలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది.
