అయోధ్య నుండి విజయవాడ వరకు ... ఈ నగరాల్లో బిచ్చగాళ్లు కనిపించరు...!
అటు అయోధ్య నుండి గౌహతి వరకు... ఇటు త్రయంభకేశ్వరం నుండి తిరువనంతపురం వరకు... బిచ్చగాళ్ల జీవితాలను మార్చే సరికొత్త ప్రణాళికలతో కేంద్ర ముందుకు వచ్చింది.
న్యూడిల్లీ :నిరుపేదల జీవితాలు చాలా దుర్భరంగా వుంటాయి. పొట్టకూటి కోసం కొందరు పేదలు కూలీనాలి చేసుకుంటే మరికొందరు ఆ ఉపాధికూడా దొరక్క ఆత్మాభిమానాన్ని చంపుకుని బిక్షమెత్తుకుంటున్నారు. దీంతో దేశంలో రోజురోజుకు బిచ్చగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మరీముఖ్యంగా దిక్కుమొక్కులేని మహిళలు, చిన్నారులే ఎక్కువగా బిక్షాటన వైపు మళ్లుతున్నారు. ఇలాంటి అభాగ్యుల జీవితాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సిద్దమయ్యింది.
భారతదేశంలో బిక్షాటన చేసేవాళ్లు లేకుండా చేసేందుకు కేంద్ర సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. బిచ్చగాళ్లు ఎక్కువగా పర్యాటక, ఆద్యాత్మిక, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వుంటారు. అలా బిచ్చగాళ్ల ఎక్కువగా వుండే 30 నగరాల్లో కేంద్ర ప్రత్యేక సర్వే చేయిస్తోంది. జిల్లాలు, మున్సిపాలిటీ అధికారుల సాయంతో బిక్షాటన చేసే మహిళలు, చిన్నారులను గుర్తించి ... వారికి స్మైల్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ఈ సర్వే ఉద్దేశం. దేశంలోని ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో 2026 నాటికి బిచ్చగాళ్ళు లేకుండా చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది.
చారిత్రాత్మక, మతపరమైన వాటితో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే నగరాలను బిక్షాటన రహితంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అందువల్లే ఇటీవల రామమందిరాన్ని ప్రారంభించిన అయోధ్యతో పాటు అనేక నగరాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికచేసింది. ఇలాంటి 30 నగరాల్లో సర్వే చేపట్టి బిక్షాటన వైపు మళ్లుతున్న నిరుపేదలకు పునరావాసం కల్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
Also Read ఓ పేదోడి కన్నీటి గాధ... భార్య శవాన్ని ఏకంగా 20కిలో మీటర్లు మోసాడు
ఇప్పటికే ఎంపికచేసిన 25 నగరాల్లో యాక్షన్ ప్లాన్ ప్రారంభమయ్యింది... కటక్, కాంగ్రా, ఉదయ్ పూర్, కుశీనగర్ లో ఇంకా ప్రారంభంకావాల్సి వుంది. ఇక సాంచి లో అసలు బెగ్గింగ్ లేదని అక్కడి అధికారులు స్పష్టం చేసారు... దీంతో ఆ స్థానంలో మరో నగరాన్ని ఎంపికచేయనున్నారు. ఇక విజయవాడ, కోజికోడ్, మధురై, మైసూరు నగరాల్లో ఇప్పటికే ఈ సర్వే పూర్తయ్యింది.
ఈ ప్రాజెక్ట్ ను వివిధ దశల్లో అమలుచేయనుంది కేంద్ర ప్రభుత్వం. మొదట సర్వే చేసి బిక్షాటన చేసేవారిని గుర్తించడం.. ఆ తర్వాత అందరినీ ఇతరప్రాంతాలకు తరలించి ఉపాధి అవకాశాలు కల్పించడం... చిన్నారులకు విద్యను అందించడం చేయనున్నారు. ఇలా సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేలా బిచ్చగాళ్ల జీవితాలను జీవితాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.