ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఇతరులకు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలంటూ ఆదివారం ఉదయం జారీ చేసిన ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. తమ సూచనను కొందరు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం వుందని, అందుకే ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను (aadhar card xerox) ఇతరులకు సమర్పించే సమయంలో జాగ్రత్తలు పాటించాలంటూ జారీ చేసిన ప్రకటనకు సంబంధించి కొన్ని గంటలు గడవకముందే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆదివారం ఉదయం జారీ చేసిన ప్రకటనను మధ్యాహ్నానికే ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను ఇతరులకు అందించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచితులకు ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని, వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఇవ్వకూడదని, ఇస్తే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుందని కేంద్రం ఆదివారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏదేనీ సంస్థ అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్‌డ్ ఆధార్ కార్డ్’ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
అయితే ఈ ప్రకటన నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడం, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం ఈ ప్రకటనపై వెనకడుగు వేసింది. ఆధార్ జిరాక్స్ కాపీలను కాకుండా మాస్క్‌డ్ ఆధార్ కార్డులను మాత్రమే వినియోగించాలని మాత్రమే సూచించామని, అయితే ఈ ప్రకటనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఉదయం విడుదల చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకో సిస్టమ్ అనేది ఆధార్ కార్డుల గోప్యతను రక్షిస్తుందని కూడా కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది.
Masked Aadhaar అంటే..
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆన్‌లైన్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా రూపొందించింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డు పై 12 అంకెల ఆధార్ నంబర్ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి ఎనిమిది 8 అంకెల స్థానంలో ****-**** గా కనిపిస్తాయి. దీంతో.. మాస్క్‌డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.
Masked Aadhaar ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, ఆధార్ డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాలి
2. తరువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. మాస్క్‌డ్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
4. ధృవీకరణ కోసం.. ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
5. అనంతరం ‘Send OTP’పై క్లిక్ చేయాలి.
6. ఇ-ఆధార్ కాపీను PDF కాపీ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
7. ఆధార్ PDF ఒపెన్ చేయాలంటే.. 8 అక్షరాల పాస్‌వర్డ్ ఉంటుంది. (మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లో, పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.)
